నకిలీ కార్డులు; లగ్జరీ షాపింగ్‌లు.. చివరికి

Cops Says 6 Of Family 2 Others Use Fake IDs Get Bank Cards To Shop - Sakshi

బ్యాంకులు లూటీ చేస్తున్న ముఠా అరెస్ట్‌ 

న్యూఢిల్లీ : నకిలీ ఐడీలతో బ్యాంకులను బురిడీ కొట్టిస్తూ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు పొందిన ఎనిమిది మందిని ఢిల్లీ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నుంచి రూ. 15 లక్షల నగదు, ఆభరణాలు, కార్డులు తయారుచేసే రెండు మెషీన్లు సీజ్‌ చేశారు. 31 పాన్‌ కార్డులు, 18 ఆధార్‌ కార్డులు 30 ఓటర్‌ ఐడీలు, వీటిని ఉపయోగించి కొనుగోలు చేసిన 15 సిమ్‌లు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వారి బ్యాంకు ఖాతాల్లోని రూ.50 లక్షలను స్తంభింపజేశామని తెలిపారు. వివరాలు... ఈ ముఠా నకిలీ ఐడీ కార్డులు సృష్టించి 13 బ్యాంకుల్లో అకౌంట్లు తెరిచి 63 డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు పొందింది. వీటితో షాపింగ్‌ చేస్తూ దాదాపు రూ.3-4 కోట్లు కాజేశారు. ఇటీవల సిటీ బ్యాంక్‌ నిర్వహించిన ఆడిట్‌ సందర్భంగా 36 నకిలీ ఖాతాలను బ్యాంకు అధికారులు గుర్తించారు. 

ఈ క్రమంలో  ఢిల్లీలోని ఆర్థిక నేరాల విభాగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోతుగా దర్యాప్తు చేపట్టగా, వీరంతా వేరువేరు పేర్లతో మారువేషాల్లో బ్యాంకులకు వెళ్లి అకౌంట్లు తెరిచేవారని తేలింది. ఇక ఈ ముఠాలోని ఎనిమిది మంది సభ్యుల్లో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విశేషం. కన్వల్‌రాజ్‌, ఆయన భార్య, ఇద్దరు కుమారులు అజయ్‌, మహేశ్‌ క్షత్రియ, ఇద్దరు కోడళ్లు ఈ ముఠాలో ఉన్నారు. వీరికి అరుణ్‌ శర్మ దంపతులు కూడా తోడయ్యారని, అంతా కలిసే ఈ నేరాలకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. 

ఈ విషయం గురించి పోలీసు ఉన్నతాధికారి ఓపీ మిశ్రా మాట్లాడుతూ.. ‘ఈ మొత్తం నేరాలకు అరుణ్‌ శర్మ అనే 25 ఏళ్ల యువకుడు ప్రధాన సూత్రధారి. నిందితుడి తండ్రి గతంలో స్విచ్‌ బోర్డులు తయారు చేసే కంపెనీ ప్రారంభించాడు. అందులో భారీగా నష్టాలు రావడంతో డబ్బుల కోసం అరుణ్‌ నేరాల బాట పట్టాడు. అతడికి నకిలీ ఆధార్‌, పాన్‌ కార్డులు తయారు చేయడానికి రవి సచ్‌దేవ్‌, ఉమేష్‌ సాయం చేశారు’ అని చెప్పారు. సచ్‌దేవ్‌, ఉమేష్‌లను కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top