‘ఎఫ్‌డీ స్కామ్‌’..  చెన్నై జైల్లో నేర్చుకున్నాడు!

CCS Police Investigation On Telugu Academy Scam - Sakshi

వెలుగులోకి తెలుగుఅకాడమీ కేసు సూత్రధారి లీలలు

సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నష్టాలతోనే సాయికుమార్‌ మోసాలబాట 

ఎన్‌సీఎల్‌ కేసులో అతనికి దక్కింది రూ.కోటి 

కమీషన్‌ కోసం తన బ్యాంకు ఖాతాను అప్పగించిన వైనం  

సీసీఎస్‌ విచారణలో బయటపడిన పలు కీలకాంశాలు  

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ (ఎఫ్‌డీ) స్కామ్‌లో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. తాజాగా సూత్రధారి చుండూరి వెంకట కోటి సాయికుమార్‌ విచారణలో సీసీఎస్‌ పోలీసులు పలు కీలకాంశాలు గుర్తించారు. ఎఫ్‌డీ స్కామ్‌కు సంబంధించి విషయాలను చెన్నై జైల్లో నేర్చుకున్నట్లు వెల్లడైంది. నార్తర్న్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌సీఎల్‌) కేసులో జైలుకు వెళ్లినప్పుడు సహనిందితులే వీటిని నేర్పించారని సాయి బయటపెట్టాడు.

హైదరాబాద్‌లోని అంబర్‌పేట ప్రాంతానికి చెందిన సాయికుమార్‌ మొదట స్వాల్‌ కంప్యూటర్స్‌ పేరుతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఏర్పాటు చేశాడు. దీనికి హైటెక్‌ సిటీతోపాటు తమిళనాడులోని చెన్నైలోనూ కార్యాలయాలు ఏర్పాటు చేశాడు. అమెరికాకు చెందిన ప్రాజెక్టులు కైవశం చేసుకోవడానికి ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో సాయికి ఈ రంగంలో నష్టాలే మిగిలాయి. ఈ క్రమంలో అతనికి తమిళనాడు ముఠాతో పరిచయమైంది. అప్పటికే ఈ గ్యాంగ్‌ ఎన్‌సీఎల్‌కు చెందిన ఎఫ్‌డీలపై కన్నేసింది.

చెన్నైలోని పలు బ్యాంకుల్లో ఉన్న రూ.25 కోట్లు కాజేయడానికి పథకం సిద్ధం చేసింది. ఈ క్రమంలో సాయితో ఒప్పందం చేసుకుంది. ఎన్‌సీఎల్‌ ఎఫ్‌డీలను లిక్విడేట్‌ చేయగా వచ్చిన రూ. 6 కోట్లను స్వాల్‌ సంస్థ పేరిట ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చెన్నై శాఖలోని కరెంట్‌ ఖాతాలోకి మళ్లించింది. ఆ మొత్తం డ్రా చేసి ఇచ్చినందుకు రూ.కోటి కమీషన్‌గా సాయికి అందించింది.  

ఇప్పటికీ మూడు ఎఫ్‌డీల స్కామ్‌ 
ఎన్‌సీఎల్‌ స్కామ్‌ వెలుగులోకి రావడంతో చెన్నైకు చెందిన సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. సూత్రధారులు సహా మొత్తం 15 మందిని అరెస్టు చేయగా, వీరిలో సాయి కూడా ఉన్నాడు. ఈ కేసులో చెన్నై జైలు కు వెళ్లిన సాయికుమార్‌ అక్కడే ఎఫ్‌డీల స్కామ్‌ ఎలా చేయాలనే అంశాలను వీరి ద్వారా తెలు సుకున్నాడు. జైలు నుంచి బయటకు వచ్చిన సాయి రియల్టర్‌ అవతారం ఎత్తాడు. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన నండూరి వెంకట రమణతో పరిచయం ఏర్పడింది.

తన స్వస్థలంలో ప్రింటింగ్‌ప్రెస్‌ నిర్వహించే వెంకటరమణకు ఓ కేంద్ర ప్రభుత్వసంస్థతో ఒప్పందం ఉంది. ఆ సంస్థకు కావాల్సిన బిల్‌ బుక్స్‌సహా అన్ని రికార్డులనూ ముద్రించి అందిస్తుంటాడు. అయితే తన పిల్లల చదువు నిమిత్తం హైదరాబాద్‌కు వలస వచ్చిన వెంకటరమణ సైనిక్‌పురి ప్రాంతంలో స్థిరపడ్డాడు. ఇతడు కూడా రియల్టర్‌గా మారాడు. ఈ క్రమంలోనే సాయితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ మరికొందరితో కలసి 2012లో ఏపీ మైనార్టీ వెల్ఫేర్‌ సొసైటీ ఎఫ్‌డీలు, 2015లో ఏపీ హౌసింగ్‌ బోర్డ్‌ ఎఫ్‌డీలు, తాజాగా తెలుగు అకాడమీ ఎఫ్‌డీల సొమ్ము కాజేశారు.  

ఏపీలోనూ కుంభకోణాలు 
తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కుంభకోణం నిందితులు 11 ఏండ్లుగా ఈ స్కామ్‌లు చేస్తున్నట్లు సీసీఎస్‌ పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ముఠా ఏపీలోని ఏపీ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ నుంచి రూ. 10 కోట్లు, ఏపీ అయిల్‌ అండ్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌కు చెందిన రూ. 5 కోట్లను కొట్టేసి, ఆ డబ్బును ఏపీ మర్కంటైల్‌ బ్యాంకులోకి మళ్లించినట్లు నిందితులు వెల్లడించారు. తెలుగు అకాడమీ కేసులో ఇప్పటి వరకు 14 మందిని సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

2009 నుంచి సాయికుమార్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కుంభకోణం చేశారని, ఇతడిపై వివిధ ప్రాంతాల్లో 8 కేసులు ఉన్నట్లు తెలిసిందని సీసీఎస్‌ అధికారులు పేర్కొంటున్నారు. 9 మంది కస్టడీ మంగళవారం ముగియడంతో వారిని కోర్టులో హాజరుపరిచిన అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు, మరో పక్క కెనరా బ్యాంకు చందానగర్‌ మాజీ మేనేజర్‌ సాధనను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు, ఆమెకు రూ. 1.99 కోట్లు సాయికుమార్‌ అందించినట్లు వెల్లడించాడు. సాయికుమార్‌తో పాటు అతని అనుచరులను మరోసారి కస్టడీలోకి తీసుకోవడానికి పిటిషన్‌ దాఖలు చేశారు, దీనిపై ఈ నెల 16వ తేదీన కోర్టులో విచారణ జరిగే అవకాశాలున్నాయి.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top