ఆకతాయిల వేధింపులు.. సిగరెట్‌ తాగమని చెట్టుకు కట్టేసి..

Bengaluru School Kids Tied To Tree And Forced To Smoke - Sakshi

బెంగళూరు(కర్ణాటక): చిన్న పిల్లలపై కొందరు అల్లరి మూకలు అమానుషంగా ప్రవర్తించారు. సిగరెట్‌ తాగాలని బలవంతం చేశారు. అంతటితో ఆగకుండా.. పాఠశాల ఆవరణలోనే చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన క్లిప్పింగ్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

పోలీసులు తెలిపిన వివరాలు.. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) ఆధ్వర్యంలో నడుపుతున్న పాఠశాలలో 10-13 సంవత్సరాల మధ్య వయస్సు గల కొంతమంది విద్యార్థులను క్యాంపస్‌లో ప్రవేశించిన ఆరుగురు సభ్యుల ముఠా తరచుగా బెదిరింపులకు గురిచేస్తోంది.

ఈ క్రమంలో గత శనివారం కూడా.. చిన్న పిల్లలను పట్టుకుని సిగరెట్‌ తాగాలని వేధింపులకు గురిచేశారు. అంతటితో ఆగకుండా పాఠశాల సమీపంలో ఉన్న దుకాణానికి వెళ్లి సిగరెట్‌లు తేవాలని చిన్న పిల్లలను బెదిరించారు. కాగా, నిందితులు... సమీపంలోని ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

నిందితులు.. పాఠశాలకు సమీపంలోని గ్రామానికి చెందిన వారు కావడంతో  యాజమాన్యం కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిందితులు పలుమార్లు ఉపాధ్యాయులను కూడా బెదిరించారని స్థానికులు తెలిపారు. కాగా, ఈ క్రమంలో కొంత మంది స్థానికులు.. పిల్లలను చెట్టుకు కట్టేసి కొడుతున్న క్లిప్పింగ్‌లను స్థానిక కార్పోరేటర్‌కు పంపించారు.

 కార్పోరేటర్‌.. పోలీసులకు, విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానిక పోలీసులు ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. వారిలో ఐదుగురు మైనర్‌లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని జువైనల్ హోమ్‌కు తరలించారు.

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్న పిల్లల తల్లిదండ్రులు పోలీసులను కోరారు. కాగా,  దీనిపై స్పందించిన డీసీపీ దేవరాజ్‌ మాట్లాడుతూ.. గ్రామంలో, పాఠశాల పరిసరాలలో అసాంఘిక చర్యలు జరగకుండా పెట్రోలింగ్‌ గస్తీని పెంచుతామన్నారు. 

చదవండి: భర్త పోస్టులకు మరో మహిళ లైక్‌లు .. చిర్రెత్తుకొచ్చిన ఆ భార్య..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top