చిట్‌ఫండ్‌ అక్రమాలు బట్టబయలు

Andhra Pradesh govt to take action on Chit fund companies irregularities - Sakshi

పలు కంపెనీల్లో ఇటీవల విస్తృతంగా తనిఖీలు

చాలా కంపెనీల్లో మోసాలు జరిగినట్లు గుర్తింపు

చర్యలకు సన్నద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: చిట్‌ఫండ్‌ కంపెనీల ముసుగులో జరుగుతున్న అక్రమాలు, మోసాలు బట్టబయలయ్యాయి. రాష్ట్రంలోని అనేక కంపెనీలు చిట్‌ల పేరుతో సామాన్యులు చెమటోడ్చి సంపాదించుకున్న సొమ్మును దుర్వినియోగం చేస్తున్నట్లు స్పష్టమైంది. చిట్‌ఫండ్‌ కంపెనీలపై జిల్లాల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తుండడంతో ఇటీవల రిజిస్ట్రేషన్లశాఖ రాష్ట్రవ్యాప్తంగా పలు కంపెనీల్లో తనిఖీలు చేసింది. జీఎస్టీ, పోలీసు అధికారులను కూడా తనిఖీ బృందాల్లో ఉంచి ఆ కంపెనీల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించింది.

ఈ తనిఖీల్లో పలు కంపెనీల్లో అక్రమాలు, మోసాలు జరిగినట్లు గుర్తించారు. చాలా కంపెనీలు చిట్స్‌ ద్వారా వసూలు చేసిన డబ్బును ఇతర కార్యకలాపాలకు మళ్లిస్తున్నట్లు గుర్తించారు. పలు కంపెనీలు చిట్‌ఫండ్‌ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆ డబ్బును వడ్డీలకు తిప్పుతున్నట్టు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసినట్టు స్పష్టమైంది. కొన్ని కంపెనీలు వసూలు చేసిన చిట్స్‌ డబ్బును తమ అనుబంధ కంపెనీలకు మళ్లించి వ్యాపారం చేసుకుంటున్నట్లు తేలింది. చిట్‌ల రికార్డులు, ఖాతాలు కూడా సరిగ్గా నిర్వహించడం లేదని వెల్లడైంది.

చిట్స్‌ పాడుకున్నవారికి వాటి కాలం తీరిన తర్వాత కూడా చెల్లించని ఘటనలు లెక్కలేనన్ని ఉన్నట్లు తెలిసింది. అనుమతులు లేకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తూ కొన్ని కంపెనీలు ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నట్టు తేలింది. చిట్‌లు పాడిన తర్వాత, గ్యారెంటీల ప్రక్రియ ముగిసేలోపు ఆ డబ్బును ప్రత్యేక బ్యాంకు ఖాతాలకు కాకుండా వేరేరకంగా వినియోగించుకున్నట్లు వెల్లడైంది. కొన్నిచోట్ల ప్రత్యేక ఖాతాల్లో ఉంచిన డబ్బును అదేరోజు వెనక్కి తీసుకున్న సందర్భాలు వెలుగులోకి వచ్చాయి.

అలాగే తాము నిర్వహిస్తున్న చిట్‌లపై ప్రభుత్వానికి తప్పుడు ఓచర్లు సమర్పిస్తున్నట్టు తేలింది. నగదు నిర్వహణలో తీవ్ర ఉల్లంఘనలు జరిగాయి. చిట్‌ల డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయకపోవడం, ఆ డబ్బుకు సంబంధించి నగదు రశీదులు.. వోచర్లు ఇవ్వకపోవడాన్ని తనిఖీ అధికారులు గుర్తించారు. కొన్ని లావాదేవీలపై నేరుగా ఆదాయపన్ను శాఖ పెనాల్టీ పడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

జీఎస్టీ చట్టాన్ని కూడా చిట్‌ఫండ్‌ కంపెనీలు ఉల్లంఘిస్తున్నట్టు తేలింది. తనిఖీల్లో గుర్తించిన అంశాలతో స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అక్రమాలు జరిగిన కంపెనీలు, వాటి వివరాలను అందులో పొందుపరిచారు. వాటి ఆధారంగా అక్రమాలు జరిగిన కంపెనీలపై చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top