కరిగిపోతున్న కొండలు, గుట్టలు
కాగితాలకే పరిమితమైన నిబంధనలు
బిల్లులు లేని వాహనాలు పట్టుబడుతున్నా ఆగని దందా
తూతూమంత్రంగా మైనింగ్, విజిలెన్స్ దాడులు
పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న క్వారీలు
నాగరాజ కుప్పం వద్ద భూమట్టాన్ని దాటి
20 అడుగుల లోతు వరకు తవ్వేసిన కొండ
గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్లు
నగరి : నియోజకవర్గంలో గ్రావెల్, కంకర అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత అన్నట్లుగా పగలు రాత్రి తేడా లేకుండా జేసీబీతో మట్టిని తవ్వేస్తున్నారు. ఈ దందా అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో నడుస్తుందన్న విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. దీంతో అధికారులు ప్రేక్షకపాత్ర వహించడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. ప్రధానంగా నగరి మండలం తడుకుపేట నుంచి రామాపురం వరకు, విజయపురం మండలం మహారాజపురంలో మట్టి మాఫియాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.
నామమాత్రంగా దాడులు
కొందరు అధికారులు మామూళ్లు తీసుకుని మట్టి మాఫికాయకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైనింగ్, విజిలెన్స్ అధికారులు అప్పు డప్పుడూ చుట్టపు చూపుగా వచ్చి తనిఖీలు చేస్తు న్నా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. క్వారీల్లో నిబంధనలను పాటించడం లేదు. విచ్చలవిడిగా తవ్వకాలు చేస్తున్నారు. ఇటీవల విజయపురం మండలం మహారాజపురం నుంచి నకిలీ బిల్లులతో వెళుతున్న మూడు టిప్పర్లను స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు పట్టుకుని పోలీసులకు అప్పగించగా రెవెన్యూ అధికారులు సీజ్‌చేశారు. వారి వద్ద ఉన్నవి నకిలీ బిల్లులని కూడా గుర్తించారు. వాటిని నిర్వహించే యజమానులపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ప్రభుత్వ ఆదాయానికి గండి
జాతీయ రహదారి సాకుతో గ్రావెల్, కంకర తమిళనాడుకు తరలిపోతోంది. రోజుకు పది బిల్లులు వేసుకొని ఆ బిల్లులతోనే వంద టిప్పర్లు తలించేస్తారు. దీంతో ప్రకృతి వనరుల ద్వారా ప్రభుత్వానికి రావలసిన ఆదాయానికి గండి పడుతోంది. అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.
నగరి నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. కొండలు, గుట్టలు, మిట్ట భూములను చెరబట్టింది. రేయింబవళ్లు జేసీబీలతో మట్టిని తవ్వుతూ టిప్పర్లు, లారీల్లో తరలించేస్తోంది. ప్రజాప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉండడంతో అధికారులు సైతం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. అప్పుడప్పుడు తూతూమంత్రంగా దాడులు చేస్తూ నొప్పించక తానొవ్వక అంటూ కవర్ చేస్తున్నారు.
చూస్తుండగానే కొండలు కరిగిపోతున్నాయి
గతంలో ప్రభుత్వ, ప్రైవేటు భవన నిర్మాణ పనులకు నగరి నియోజకవర్గంలో సుమారు 15 స్టోన్ క్వారీలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం 50 క్వారీలు ఉన్నాయి. ఇవిగాక కొత్తగా తడుకు గ్రామంలో సర్వే నంబరు 85/1లో 6.514 హెక్టార్లు, సర్వే నంబరు 57లో 4.844 హెక్టార్లు, సర్వే నంబరు 100లో 4.996 హెక్టార్లు, సర్వే నంబరు 57, 102లలో 5.616 హెక్టార్లు, సర్వే నంబర్లు 85/4, 85/7లలో 5 హెక్టార్లు, సర్వే నంబరు 85లో 8 హెక్టార్లలో క్వారీలు నిర్వహించడానికి అనుమతి ఇచ్చారు. అలాగే కీళపట్టు రెవెన్యూలో గ్రావెల్, స్టోన్, బోల్డర్స్ తీసుకునేందుకు రెండు నూతన క్వారీలకు అనుమతి ఇచ్చేశారు. వారు భారీ పేలుళ్లతో కొండలు, గుట్టలను ధ్వంసం చేస్తున్నారు. పేలుళ్ల దాటికి ప్రజల ఇళ్లు భీటలు వారుతున్నాయి. రాళ్లు, దుమ్ము పొలాలపై పడుతుండడంతో పంటలు పండడం లేదని రైతులు వాపోతున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా అధికారులు కొత్త క్వారీలకు అనుమతులు ఇస్తూనే ఉన్నారు. జాతీయ రహదారి పనులు పూర్తయ్యే లోపు నగరిలోని కొండలు, గుట్టలు ఖాళీ అయిపోతాయని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ‘గిరి‘ అన్నది నగిరి అనే పేరులోనే ఉంటుంది తప్ప ఊరులో ఉండదని అంటున్నారు.


