పరిశ్రమలకు భూమిలివ్వాలని రైతులపై ఒత్తిడి | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమలకు భూమిలివ్వాలని రైతులపై ఒత్తిడి

May 18 2026 6:33 AM | Updated on May 18 2026 6:33 AM

● ఇప్పటికే 350 ఎకరాల సేకరణ ● బాధితులకు అందని నష్ట పరిహారం ● మళ్లీ 250 ఎకరాలు ఇవ్వాలనంటున్న అధికారులు ● భూములు తీసుకుంటే ఎలా బతకాలని రైతు ఆవేదన ● తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం

కుప్పం: గుడుపల్లె మండలం పొగురుపల్లె వద్ద ఇండస్ట్రియల్‌ కారిడార్‌ వస్తుందని చెబుతూ ప్రభుత్వం రైతుల నుంచి భూములు సేకరిస్తోంది. రైతులు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇందులో భాగంగానే ఆరు నెలల క్రితం పొగురుపల్లి గ్రామ సమీపంలో 350 ఎకరాలు తీసుకుంది. బాధిత రైతులకు ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు మల్బరి తోటలతోపాటు పూల తోటలు, అరటి, కూరగాయలు తదితర పంటలు సాగు చేసుకుంటున్నారు. అలాంటి మంచి భూములను పరిశ్రమల కోసం ఇవ్వాలని అధికారులు రైతులపై ఒత్తిడి తీసుకువచ్చారు. రైతులు చేసేదేమీ లేక భూములు ఇచ్చారు. వాటిలో పరిశ్రమల నిర్మాణ పనులు చేస్తున్నారు. బాధిత రైతులకు పరిహారం మాత్రం ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారో సమాచారం కూడా లేదు. ఇప్పుడు మళ్లీ 250 ఎకరాల సెటిల్‌మెంట్‌ భూములపై ప్రభుత్వం కన్నేసింది. రైతులు తమ భూములు ఇచ్చేది లేదని ఎదురు తిరిగారు. ఇప్పటికే వందల ఎకరాల భూములను కోల్పోయామని, మిగిలిన భూములను తీసుకుంటే జీవనం ఎలా సాగించాలని ప్రశ్నిస్తున్నారు. 500 కుటుంబాలు వీధిన పడతాయని నిలదీస్తున్నారు. దీంతో భూసేకరణకు ఇబ్బందిగా మారింది. దీనిపై జిల్లా, మండల అధికార యంత్రాంగం, పోలీసులు గ్రామస్తులపై ఒత్తిడి చేపట్టారు. నష్ట పరిహారం చెల్లిస్తామని, కచ్చితంగా భూములు ఇవ్వాల్సందేనని హెచ్చరించారు. దీంతో ఏమి చేయాలో దిక్కతోచని స్థితిలో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో సోమశేఖర్‌రెడ్డి అనే రైతు శనివారం గుడుపల్లె తహసీల్దార్‌ కార్యాలయం వద్ద శరీరంపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.

Advertisement
 
Advertisement
Advertisement