వైఎస్సార్‌ డిగ్రీ కళాశాలపై కూటమి కక్ష | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ డిగ్రీ కళాశాలపై కూటమి కక్ష

May 18 2026 6:33 AM | Updated on May 18 2026 6:33 AM

● కళాశాల అభివృద్ధి పట్టని ప్రభుత్వం ● పేదలకు ఉన్నత విద్య అందని ద్రాక్షే ● వైఎస్సార్‌ సీపీ నాయకుల ఆందోళన

వెదురుకుప్పం: పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలన్న ఉద్దేశంతో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వెదురుకుప్పం మండలానికి డిగ్రీ కళాశాలను మంజూరు చేసిందని, కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతున్నా కళాశాల నిర్మాణం గురించి పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు. వారు ఆదివారం పచ్చికాపల్లంలో ఉన్న డిగ్రీ కళాశాలకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. అందులో ముళ్ల కంపలతో నిండిపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ సీపీ ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షుడు బట్టే సుబ్రమణ్యం విలేకరులతో మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వెదురుకుప్పంలో డిగ్రీ కళాశాల మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కళాశాల మంజూరు చేసినట్లు చెప్పారు. పచ్చికాపల్లం సమీపంలో 11 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. భవన నిర్మాణాలకు రూ.17,82,50,000 మంజూరు చేశారని వివరించారు. ఎన్నికల కోడ్‌ రావడంతో పనులు ఆగిపోయాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతున్నా డిగ్రీ కళాశాల గురించి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కళాశాలను వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మంజూరు చేశారనే అక్కసుతోనే పేదల చదువుపై చంద్రబాబు విషం చిమ్ముతున్నట్టు మండిపడ్డారు. వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు బండి హేమ సుందర్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్య కు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. కళాశాలల అభివృద్ధికి నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తోందని దుయ్యబట్టారు. ఫలితంగా పేద విద్యార్థులు ప్రైవేటు వైపు మొగ్గుచూపాల్సి వస్తోందన్నారు. ఇప్పటికై నా డిగ్రీ కళాశాల గురించి పట్టించుకోవాలన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సుకుమార్‌, వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రామయ్య, యువజన విభాగం జిల్లా కార్యదర్శి నరేష్‌రెడ్డి, వైద్య విభాగం జీడీనెల్లూరు నియోజకవర్గ అధ్యక్షుడు ప్రకాష్‌, మాజీ సర్పంచులు చిరంజీవిరెడ్డి, రమేష్‌రెడ్డి, గోవిందన్‌, కోఆప్షన్‌ సభ్యుడు వెంకటేశ్‌, ఎస్సీ సెల్‌ మండల కార్యదర్శి మురళీ, విద్యార్థి విభాగం అధ్యక్షుడు జగదీశ్‌రెడ్డి, సింగిల్‌విండో మాజీ డైరెక్టర్‌ మునికృష్ణారెడ్డి, నాయకులు పురందర్‌రెడ్డి, వెంకటేశ్‌, వాసు, ఈశ్వరరెడ్డి, బొజ్జారెడ్డి, రేణుక పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement