ఫైనాన్స్ కార్పొరేషన్ సిఫార్సులకు బ్రేక్
రూ.382 కోట్ల బకాయిలు
మైనర్ పంచాయతీలపై భారం
ప్రభుత్వం పంచాయతీలకు ఆదాయ వనరులను కల్పించకపోగా మరింత భారం వేస్తోంది. విద్యుత్ బిల్లులను పంచాయతీలే భరించాలని ఆదేశించింది. గతంలో లాగా ప్రభుత్వమే చెల్లించాలన్న ఫైనాన్స్ కార్పొరేషన్ చేసిన డిమాండ్‌కు బ్రేక్ వేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సర్వీసులకు ఏర్పాటుచేసిన స్మార్ట్ మీటర్లను ఇకపై ప్రీపెయిడ్ మీటర్లుగా మార్చనున్నారు. ఇప్పటికే విద్యుత్ బకాయిలు పేరుకుపోయిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంతో పంచాయతీలపై అదనపు భారం పడనుంది. ఫలితంగా గ్రామాలు చీకట్లో ఉండాలా అని ప్రజలు వాపోతున్నారు.
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో మొత్తం 623 పంచాయతీలున్నాయి. మేజర్ పంచాయతీలు బంగారు పాళ్యం. కార్వేటినగరం, రామకుప్పం, వి.కోట, కల్లూరు, పొలకల, డి.అగరం, అరగొండ, రొంపిచెర్ల ఉన్నాయి. మిగిలిన 614 మైనర్ పంచాయతీ లు.వాటిలో ఆదాయం, జనాభా ప్రాతిపదికన గ్రా మ పంచాయతీలను గ్రేడ్లుగా విభజించారు. గ్రేడ్–1 పంచాయతీలు –34, గ్రేడ్–255, గ్రేడ్–3 పంచాయతీలు 90, గ్రేడ్–4 కలిగినవి 223, గ్రేడ్–5 కింద 214 ఉన్నాయి. వీటిలో గ్రేడ్–1 పంచాయతీలు 34 వరకూ ఉన్నాయి. మిగిలిన 589లో ఒక 100 పంచాయతీల ఆదాయం సుమారుగా ఉంది. మిగిలిన 489 పంచాయతీల ఆదాయం అంతంతమాత్రమే. ప్రధానంగా ఇంటి పన్నులు, మంచినీటి చెరువుల గట్ల చుట్టూ ఉండే టెంకాయ చెట్లతోపాటు చింత తదితర చెట్ల నుంచి వచ్చే ఫలసాయం తప్ప మరో ఆదాయ మార్గం ఉండడం లేదు. అవి కూడా లేని గ్రామ పంచాయతీలు ఆర్థికంగా నానా పాట్లు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మైనర్ గ్రామ పంచాయతీల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన బాఽ ద్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని రాష్ట్ర ఫైనా న్స్ కార్పొరేషన్ చేసిన సిఫార్సులకు చంద్రబాబు ప్రభుత్వం నో చెప్పింది. వీధి దీపాల నిర్వహణ ఖర్చును గ్రామ పంచాయతీలే భరించాలని స్పష్టం చేసింది.
రూ.382 కోట్లు బకాయిలు
జిల్లాలో గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులు పేరుకుపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్ వరకు రూ.382 కోట్లు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. వీటిని చెల్లించాలని ట్రాన్స్‌కో జిల్లా యంత్రాంగం చెబుతోంది. ప్రతినెలా మేజర్ పంచాయతీల్లో రూ.90 లక్షలు, మైనర్ పంచాయతీల్లో రూ.9.10 కోట్ల వరకు కరెంటు బిల్లులు వస్తున్నాయి. ఏడాదికి రూ.120 కోట్లు కరెంటు బిల్లులు చెల్లించాల్సి ఉంది. మేజర్ గ్రామ పంచాయతీలకు వార్షిక ఆదాయం ఉంటుంది కాబట్టి విద్యుత్ బిల్లుల చెల్లింపులో ఇబ్బంది లేదు. మైనర్ పంచాయతీలకు సొంత నిధులు లేని దుస్థితి. మౌలిక వసతులు కూడా కల్పించలేని స్థితిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీధి దీపాలు, తాగునీటి మోటార్ల విద్యుత్ బిల్లుల చెల్లింపు వాటికి మోయలేని భారమవుతోంది. పారిశుద్ధ్య కార్మికుల జీతభత్యాలు చెల్లించడానికే ఆదాయం చాలడం లేదని, ఇక విద్యుత్ బిల్లుల చెల్లింపు ఏవిధంగా చేయాలో తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు.
జిల్లా పంచాయతీల సమాచారం
జిల్లాలో మొత్తం పంచాయతీలు 623
మేజర్ పంచాయతీల బకాయిలు
రూ.32 కోట్లు
మైనర్ పంచాయతీల బకాయిలు రూ.350 కోట్లు
మొత్తం రూ.382 కోట్లు
విద్యుత్ బిల్లుల
చెల్లింపులకు ప్రభుత్వం నో


