పేదలపై ఇంధనం బాంబ్‌..! | - | Sakshi
Sakshi News home page

పేదలపై ఇంధనం బాంబ్‌..!

May 17 2026 12:18 AM | Updated on May 17 2026 12:18 AM

ఆటో చార్జీల పెంపు సామాన్యుడి బతుకు భారం నిత్యావసరాల ధరలు మరింత పెరిగే అవకాశం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు సామాన్యుడి బతుకును భారంగా మారుస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఎలాగోలా జీవితాలను నెట్టుకొస్తున్న పేదలపై తాజాగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత భారం మోపాయి. ఆ ప్రభావం వాహనదారులపైనా పడింది. షేరింగ్‌ ఆటోల చార్జీలు కూడా పెంచారు. ఇది ప్రజలకు మరో పెద్ద షాక్‌గా మారింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో వరుసగా పెరుగుతున్న ధరలతో పేద, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక బడ్జెట్‌ పూర్తిగా దెబ్బతింటోంది.

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లాలో 146 పెట్రోల్‌ బంక్‌లు ఉన్నాయి. రోజువారీగా సుమారు 600 కేఎల్‌ డీజిల్‌, 4 వేల కేఎల్‌ పెట్రోల్‌ వరకు సరఫరా అవుతున్నట్లు అధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది. తాజాగా జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. పెట్రోల్‌ ధర రూ.110.27 నుంచి రూ.113.56 చేరగా, డీజిల్‌ ధర రూ.98.16 నుంచి రూ.101.30కు పెరిగింది. పవర్‌ పెట్రోల్‌ కూడా రూ.123.02కు చేరింది. ఒక్క లీటరుపైనే రూ.3లకు పైగా భారం పడడంతో ఆ ప్రభావం వాహనదారులపై నేరుగా పడుతోంది. దీంతో బైక్‌ వినియోగదారులు, కార్ల యజమానులు, డెలివరీ బాయ్స్‌ నుంచి చిన్న వ్యాపారుల వరకు నెలవారీ ఖర్చులు పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంధన ధరల పెంపు ప్రభావం రవాణా రంగంపై చూపింది. డీజిల్‌పై ఆధారపడే లారీలు, ట్రాక్టర్లు, ఆటోలు, వ్యవసాయ యంత్రాలు..ఇలా అన్నీ ఖర్చులు పెరిగిపోయాయి. షేరింగ్‌ ఆటో చార్జీలు ఒక్కసారిగా పెరిగాయి. ఇప్పటి వరకు రూ.10 నుంచి రూ.15 ఉన్న ప్రయాణానికి ఇప్పుడు రూ.15 నుంచి రూ.30 వరకు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బస్సు సౌకర్యం తక్కువగా ఉండడంతో ప్రజలు పూర్తిగా ఆటోలపైనే ఆధారపడుతున్నారు. రోజూ కూలి పనులకు వెళ్లే వారు, మార్కెట్‌కు వెళ్లే రైతులు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ప్రైవేట్‌ ఉద్యోగులు ఇప్పుడు అదనపు చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. గ్రామం నుంచి మండల కేంద్రానికి వెళ్లి రావడానికే రోజుకు రూ.100 నుంచి రూ.150 వరకు ఖర్చవుతోందని ప్రజలు చెబుతున్నారు.

టీడీపీ పాలనలో పెట్రోల్‌, డీజిల్‌ మోత

నిత్యావసర సరుకులపైనా ప్రభావం

ఇంధన ధరల పెంపు ప్రభావం పరోక్షంగా కూడా కనిపిస్తోంది. రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయలు, పండ్లు, కిరాణా సరుకులు, పాలు, నిర్మాణ సామగ్రి వంటి అన్ని వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. సరుకు తరలించే ఖర్చు పెరగడంతో చివరకు ఈ భారం వినియోగదారుడిపైనే పడుతోంది. ఇప్పటికే విద్యుత్‌ చార్జీలు, గ్యాస్‌ ధరలు, స్కూల్‌ ఫీజులు, వైద్యం ఖర్చులు పెరిగి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇంధన ధరలు, ఆటో చార్జీల పెంపు కలిసి మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ను పూర్తిగా కుదేలు చేస్తున్నాయి. ప్రతి నెలా ఖర్చులు పెరుగుతుండడంతో జీతం వచ్చిన కొద్ది రోజుల్లోనే ఖాళీ అవుతోందని వాపోతున్నా రు. సామాన్యుడిపై పడుతున్న భారం తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement