గురుకులాల్లో అడ్మిషన్ల సమాచారమేదీ? | - | Sakshi
Sakshi News home page

గురుకులాల్లో అడ్మిషన్ల సమాచారమేదీ?

May 16 2026 3:07 AM | Updated on May 16 2026 3:07 AM

ప్రవేశాల జాబితా ఎప్పుడు వస్తుందో

తెలియక ఎదురుచూపులు

అడ్మిషన్ల కసరత్తుపై అధికారుల

అలసత్వం

చిత్తూరు కలెక్టరేట్‌ : పేద, వెనుకబడిన వర్గాల విద్యా ర్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ (ఎస్సీ) గురుకుల పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ఈ ఏడాది ప్రవేశాల ప్రక్రియ తీవ్ర ప్రహసనంగా మారింది. 2026– 27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల కసరత్తు ఏ దశకు చేరిందనే సమాచారాన్ని అధికారులు బహిర్గతం చేయడం లేదు. దీంతో సీట్ల కేటాయింపు, ఎంపిక జాబితా కోసం జిల్లాలో వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. సాధారణంగా మే నెల సగంలో గురుకులాల్లో ప్రవేశాల ఎంపిక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఈ సారి ఎంపిక జాబితా విడుదలపై అధికారిక వెబ్‌సైట్లలో గానీ, పత్రికా ప్రకటనల ద్వారా గానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ప్రవేశ పరీక్షలు రాసిన విద్యార్థుల మార్కు లు, మెరిట్‌ లిస్టు, సీట్ల కేటాయింపు సమాచారాన్ని సకాలంలో అందించడంలో జిల్లా స్థాయి అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రైవేట్‌ పాఠశాలల వైపు అడుగులు?

ప్రభుత్వ గురుకులాల్లో సీటు వస్తుందో రాదో తెలియని అయోమయ స్థితిలో తల్లిదండ్రులు కొట్టుమిట్టాడుతున్నారు. అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమవుతుండడంతో చాలామంది అరకొర స్థోమత ఉన్నప్పటికీ ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అడ్మిషన్ల కసరత్తు వివరాలు, సీట్ల కేటాయింపుల జాబితాను వెంటనే బహిర్గతం చేయాలని విద్యార్థి సంఘాల నేతలు, తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. హెల్ప్‌లైన్‌ నంబర్లు, జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయాల ద్వారా స్పష్టమైన సమాచారం అందేలా కలెక్టర్‌ తక్షణ చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

గందరగోళంలో

విద్యార్థులు, తల్లిదండ్రులు

Advertisement
 
Advertisement
Advertisement