తవణంపల్లె: అర్ధగిరి వీరాంజనేయస్వామి దేవస్థానం అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం మండలంలోని అర్ధగిరి వీరాంజనేయస్వామి దేవస్థానంలో ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ రఘుపతి సమక్షంలో అర్ధగిరి ఆలయ అభివృద్ధిపై పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రికి సమర్పించిన వినతిపత్రంలో ఆలయ పరిసరాల్లో టాయ్‌లెట్లు, క్యూ కాంప్లెక్స్‌లు, అన్నదాన సత్రం, పార్క్ వంటి అభివృద్ధి పనులు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. అర్ధగిరి ట్రస్టుబోర్డు సభ్యులు, దేవదాయశాఖాధికారులు, పర్యాటక శాఖ, డ్వామా, అటవీశాఖ అధికారులతో కలసి ఆలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి కార్యాలయ సమాచారం మేరకు సమీక్ష సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. అభివృద్ధి పనులు ఏవిధంగా అమలు చేయాలి, ఏఏ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి, నిధులు వినియోగం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. జూన్ 15 నాటికి తుది నిర్ణయంతో నివేదిక అందజేయాలని ఆదేశించారు. అర్ధగిరి ఆలయం పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని సూచించారు. ఆలయ ఈఓ మునిశేఖర్, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ చంద్రశేఖర్, డ్వామా పీడీ రవికుమార్, టూరిజంశాఖ అధికారి నరేంద్ర, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ, తహసీల్దార్ మాధవరాజు, ఎంపీడీఓ హరిప్రసాద్‌రెడ్డి, ఏపీఓ బాల పాల్గొన్నారు.
పూర్ణకుంభంతో ఘన స్వాగతం
కలెక్టర్ సుమిత్‌కుమార్‌కు అర్ధగిరి శ్రీవీరాంజనేయస్వామి దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ రఘుపతి, ఈఓ మునిశేఖర్, ట్రస్టుబోర్డు సభ్యులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకొన్నారు. అనంతరం శేషవస్త్రాలతో సత్కరించి, స్వామి చిత్ర పటాన్ని, తీర్థప్రసాదాలు, సంజీవరాయ పుష్కరిణి తీర్థం అందజేసి ఆశీర్వాదించారు.


