కేజీబీవీల్లో 53 మంది బదిలీ | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీల్లో 53 మంది బదిలీ

Apr 29 2026 8:12 AM | Updated on Apr 29 2026 8:12 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా సమగ్రశిక్ష కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ) ఉద్యోగుల ప్రక్రియ పలు ఆరోపణల మధ్య కొనసాగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని కేజీబీవీల్లో దరఖాస్తు చేసుకున్న మహిళా ఉద్యోగులను ఉదయం 9 గంటలకు హాజరుకావాలని ఆదేశించారు. సమయానికి ఉద్యోగులు వచ్చినప్పటికీ అధికారులు ఆలస్యంగా రావడంతో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కౌన్సెలింగ్‌ ప్రారంభంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. బదిలీల కోసం మొదట ఆప్షన్‌ ఫారాలు స్వీక రించకుండా రాజకీయ ప్రజాప్రతినిధుల సిఫార్సులకు ప్రాధాన్యం ఇస్తున్నారని వెల్లడించారు. అధికారులు చెప్పిన ప్రాంతాన్నే కోరుకోవాలని సిబ్బంది పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిపారు. అయితే, ఎటువంటి ఫిర్యాదులకు తావులేకుండా కౌన్సెలింగ్‌ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అభ్యర్థులను నేరుగా పిలిపించి, ఖాళీల వివరాలను వెల్లడించిన తర్వాతే కౌన్సెలింగ్‌ నిర్వహించినట్లు సమగ్రశిక్ష శాఖ అధికారులు తెలిపారు. ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని కేజీబీవీల్లో పనిచేస్తున్న 53 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఎస్‌వోలు 9 మందిలో ఏడుగురు, పీజీటీల్లో 3, పీఈటీల్లో ఏడుగురిలో ఆరుగురు, సీఆర్‌టీలు 34 మంది పాల్గొన్నారు. ఒకే పాఠశాలలో ఎస్‌వో కేడర్‌లో ఐదేళ్లు, టీచర్‌ కేడర్‌లో ఎనిమిదేళ్లు, రెండేళ్లు పూర్తయిన వారికి అభ్యర్థన బదిలీలకు అవకాశం కల్పించారు. 2026 మార్చి 31వ తేదీ నాటికి పూర్తి అయిన సంవత్సరాలను బట్టి బదిలీలు నిర్వహించారు. బదిలీల కౌన్సెలింగ్‌ లో ఆప్షన్‌లు కోరుకున్న ఉద్యోగులకు రాష్ట్ర విద్యా శాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేస్తారని అధికారులు వెల్లడించారు. డీఈవో రాజేంద్రప్రసాద్‌, చిత్తూరు జిల్లా సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణ, అన్నమయ్య జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ అనురాధ, కేజీబీవీ జీసీడీవో ఇంద్రాణి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement