స్పాట్‌ పెట్టేశారు! | - | Sakshi
Sakshi News home page

స్పాట్‌ పెట్టేశారు!

Apr 29 2026 8:06 AM | Updated on Apr 29 2026 8:06 AM

● పదో తరగతి స్పాట్‌ వాల్యూయేషన్‌లో తప్పిదాలు ● 500 జవాబుపత్రాల మార్కులను స్కాన్‌ చేయని వైనం ● వాటిని వెనక్కి పంపిన రాష్ట్ర పరీక్షల విభాగం

చిత్తూరు కలెక్టరేట్‌ : పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలు ముగిసిన తర్వాత అత్యంత కీలకంగా భావించే మూల్యాంకన ప్రక్రియలో ఘోర తప్పిదాలు చోటు చేసుకున్నాయి. ఈ తప్పిదాలన్నీ చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వింత నిర్ణయాల వల్లేనని విద్యావేత్తలు పెదవి విరుస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పీసీఆర్‌ ప్రభుత్వ పాఠశాల కేంద్రంగా పలు జిల్లాల నుంచి విచ్చేసిన జవాబు పత్రాల మూల్యాంకనం చేపట్టారు. ఈ మూల్యాంకనానికి సంబంధించి దాదాపు 500 జవాబు పత్రాలను రాష్ట్ర పరీక్షల విభాగం ఇటీవల వెనక్కి పంపింది.

తప్పిదానికి బాధ్యత ఎవరిది?

గతంలో ఎన్నడూ ఇలాంటి తప్పిదాలు చోటు చేసుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కా నింగ్‌ విధానం వల్లే జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఇత ర జిల్లాల్లో సైతం ఇదే తప్పిదాలు చోటు చేసుకున్నా యి. ఈ వైఫల్యానికి బాధ్యులను గుర్తించడంలో ప్రభుత్వం తాత్సరం చేస్తోందని విమర్శలు వస్తున్నాయి.

ఇది అక్షరాల నేరం!

పదో తరగతిలో వచ్చే మార్కులు ఇంటర్మీడియెట్‌ అడ్మిషన్‌లకే కాదు, భవిష్యత్‌లో ఉద్యోగాలకు సైతం ఎంతో కీలకం. 500 మంది విద్యార్థుల మార్కులు నమోదు కాకపోతే, ఒక వేళ రాష్ట్ర అధికారులు గుర్తించకపోతే వారి పరిస్థితి ఏమిటని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రాల్లో భారీగా నిధులు ఖర్చు చేస్తున్నా, పారదర్శకత ఎందుకు కరువైంది? నిపుణులైన ఉపాధ్యాయులను పక్కన పెట్టి, ప్రైవేట్‌ వ్యక్తులకు, శిక్షణ లేని వారికి స్కానింగ్‌ బాధ్యతలు అప్పగించడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని పలువురు విమర్శిస్తున్నారు.

శిక్ష ఎవరికి?

ఇంత పెద్ద పొరపాటు జరిగిన తర్వాత జిల్లా స్థాయిలో ఎవరిపై చర్యలు తీసుకోలేదు. అధికారుల మధ్య ఉన్న అంతర్గత అవగాహన లోపమే విద్యార్థులకు శాపంగా మారుతోందని తెలుస్తోంది. ఈ ఘటన వల్ల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్‌ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం (స్పాట్‌ వాల్యూయేషన్‌)లో చోటు చేసుకున్న బాధ్యతారాహిత్య వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు సర్కారు వింత ప్రయోగాలతో తప్పిదాలు చోటు చేసుకున్నాయి. ఈ వ్యవహారం పై జిల్లా వ్యాప్తంగా విద్యావేత్తలు, తల్లిదండ్రులు నిప్పులు చెరుగుతున్నారు. వందల సంఖ్యలో విద్యార్థులు నష్టపోనున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తప్పిదాలు ఇవే

నిబంధనల ప్రకారం ప్రతి జవాబుపత్రం పై వేసిన మార్కులను స్కానింగ్‌ చేసి ఆన్‌లైన్‌ డేటాబేస్‌కు అనుసంధానించాల్సి ఉంటుంది. కానీ, చిత్తూరులో దాదాపు 500 పేపర్లకు సంబంధించి స్కానింగ్‌ ప్రక్రియను పూర్తి చేయకుండానే, అంతా బాగుందని అధికారులు రాష్ట్ర కార్యాలయానికి నివేదించారు. రాష్ట్ర స్థాయి అధికారులు డేటాను సరిచూస్తున్న సమయంలో ఈ 500 మంది విద్యార్థుల మార్కుల వివరాలు శూన్యంగా చూపించాయి. దీంతో కంగారుపడ్డ ఉన్నతాధికారులు ఆ పత్రాల వివరాలను తిరిగి పరిశీలించాలని జిల్లాకు పంపారు. తప్పు బయటపడటంతో జిల్లా విద్యాశాఖ అధికారులు అప్రమత్తమై, హుటాహుటిన ఆ పత్రాలను మళ్లీ స్కాన్‌ చేసి పంపారు. అయితే, అసలు పొరపాటు ఎక్కడ జరిగిందనే దానిపై స్పష్టత ఇచ్చేందుకు విద్యాశాఖ అధికారులు వెనుకాడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement