చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం ల్యాబ్ టెక్నీషియన్లతో డీఎంఅండ్‌హెచ్‌ఓ నాగశశిభూషణ్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పీహెచ్‌సీలకు పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వబడుతుందన్నారు. డాక్టర్ నుంచి మందులు అందించే సిబ్బంది వరకు అందరి పనితీరుపై ఈ గ్రేడింగ్ ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ల్యాబ్‌లలో మూడు నెలలకు సరిపడా స్టాక్ తప్పనిసరిగా ఉండాలని, అన్ని రికార్డులు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచాలని ఆదేశించారు. జిల్లా అదనపు వైద్యాధికారి వెంకటప్రసాద్ మాట్లాడుతూ, మార్చి 24 నుంచి ప్రారంభమైన టీబీ ముక్త్‌భారత్ అభియాన్ 2.0 కార్యక్రమం 100 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గర్భిణులు, హైరిస్క్ గ్రూపులకు తప్పనిసరిగా కఫ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన అన్ని వివరాలను స్వర్ణాంధ్ర పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
నెలాఖరు వరకు
50 శాతం వడ్డీ మాఫీ
చిత్తూరు అర్బన్: మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తిపన్నుపై 50 శాతం వడ్డీ మాఫీని ఏప్రిల్ 30వ తేదీ వరకు కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జిల్లాలోని మునిసిపల్ కమిషనర్లకు ఉత్తర్వులు అందాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తిపన్నుపై వడ్డీని పూర్తిగా మాఫీ చేయని ప్రభుత్వం.. 50 శాతం వడ్డీ మాఫీ చేస్తూ, మార్చి 31వ తేదీలోపు చెల్లించి వాళ్లకే ఈ అవకాశం అన్నట్లు గతనెల ఉత్తర్వులు జారీచేసింది. అయితే చివరి తేదీ ముగిసేనాటికి ప్రజల్లో దీనిపై పెద్దగా స్పందన రాలేదు. దీంతో 50 శాతం వడ్డీ మాఫీని ఈ నెలాఖరు వరకు కొనసాగిస్తూ మరోమారు ఆదేశాలు జారీచేసింది.
ఏసీబీ అధికారుల
విచారణ
కుప్పం: కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. 2024లో అప్పటి సబ్‌రిజిస్ట్రార్ వెంకటసుబ్బయ్య ఏసీబీ అధికారులకు చిక్కారు. ఆయనతో పాటు జూనియర్ అసిస్టెంట్ మోహన్ పట్టుబడ్డారు. దీనిపై ఏసీబీ అధికారులు కుప్పం సబ్‌రిజిస్ట్రార్ కార్యలయంలో విచారణ చేపట్టారు. సాక్షులను సుదీర్ఘకంగా విచారణ చేపట్టారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గురువారం నిశబ్ద వాతావరణం నెలకొంది.
పక్కాగా ‘సంజీవి’ని
చిత్తూరు కలెక్టరేట్: సంజీవిని ప్రాజెక్టును పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ సిబ్బందిని ఆదేశించారు. జీడీనెల్లూరు నియోజకవర్గంలో సంజీవిని ప్రాజెక్టు అమలుపై వైద్యశాఖ అధికారులతో గురువారం ఆయన కలెక్టరేట్‌లో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ పీహెచ్‌సీలకు వచ్చే వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, ఏబీహెచ్‌ఏ ఐడీని క్రియేట్ చేయాలన్నారు. రోగుల వివరాలను ఆన్‌లైన్ నమోదు చేయడం ద్వారా భవిష్యత్తులో సేవలకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. డీఎంహెచ్‌ఓ నాగశశిభూషణ్ రెడ్డితో పాటు వైద్యాధికారులు అనిల్‌కుమార్, ప్రవీణ, గిరి, శ్రీవాణి, నర్సింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రజలు తమ అభిప్రాయాల్ని తెలపవచ్చని కలెక్టర్ తెలిపారు. బీసీ రిజర్వేషన్ల అమలుపై పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్‌ను నియమించిందన్నారు. తమ వినతులను ఈ నెల 30లోగా సమర్పించవచ్చనిసూచించారు.
‘హెల్మెట్ పెట్టు..
బహుమతి పట్టు’
చిత్తూరు అర్బన్: రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు చిత్తూరు జిల్లా పోలీసులు ‘హెల్మెట్ పెట్టు – బహుమతి పట్టు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎస్పీ తుషార్‌డూడి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో హెల్మెట్ ధరించిన రైడర్లు, పిలియన్ రైడర్లకు బహుమతులు అందజేయనున్నారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు స్లిప్‌లు ఇచ్చి, లక్కీ డ్రా ద్వారా వారానికి, నెలకు నగదు బహుమతులు ప్రకటించనున్నారు. మొత్తం రూ.1.67 లక్షల బహుమతులు ఇవ్వనున్నారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేస్తూనే, పాటించని వారిపై జరిమానాలు విధిస్తామని పోలీసులు హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు జిల్లా ప్రజలు సహకరించాలని కోరారు.


