పుర పోరుకు.. పునర్విభజన బ్రేక్‌! | - | Sakshi
Sakshi News home page

పుర పోరుకు.. పునర్విభజన బ్రేక్‌!

Apr 3 2026 7:50 AM | Updated on Apr 3 2026 7:50 AM

జనాభా ఆధారంగా వార్డులపునర్విభజనకు ఉత్తర్వులు 2011 జనాభాను పరిగణనలోకి తీసుకోవాలన్న ప్రభుత్వం ఇప్పటికే మొదలైన జనగనణ–2026 లెక్కలు ఏం చేద్దాం? ఏడు రోజుల్లో వార్డులు.. ఆపై తుది ప్రచురణ జిల్లాలోని మునిసిపాలిటీల్లో35 వార్డుల పెంపు

చిత్తూరు అర్బన్‌: మునిసిపల్‌ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సానుకూలనంగా లేదనే వాదన మరోమారు బలంగా వినిపిస్తోంది. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు సంబంధించి విడుదలైన మార్గదర్శకాలు ఈ వాదనకు అదనపు బలాన్ని చేకూరుస్తోంది. అధికారుల గొంతుపై ఏడు రోజుల గడువు కత్తి అడ్డుగా పెట్టి వార్డుల పునర్విభజన చేయాల్సిందేనంటూ ప్రభుత్వం షరతు పెట్టింది. జిల్లాలోని మూడు మునిసిపాలిటీలు, ఓ కార్పొరేషన్‌తో కలిపి కొత్తగా 35 వార్డులు పెరగనున్నాయి.

ఇలా పునర్విభజన

జిల్లాలో చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు పలమనేరు, కుప్పం, నగరి మునిసిపాలిటీలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం మునిసిపల్‌ అధికారులు వార్డుల పునర్విభజన చేయాలి. ఈ లెక్కన చిత్తూరు కార్పొరేషన్‌లో 1,89,332 లక్షల జనాభా ఉన్నారు. ఈ మొత్తాన్ని 60తో భాగిస్తే 3,155 మంది జనాభా ఉంటారు. అంటే వార్డుల పునర్విభజనలో ఒక్కో డివిజన్‌లో సగటున 3,155 మంది జనాభా ఉండేలా చూసుకోవాలి. ఇందులో 10 శాతం హెచ్చు తగ్గులు ఉండొచ్చు. అలాగే పలమనేరు జనాభా ఆధారంగా 40, నగరిలోనూ 40 వార్డులుగా రూపాంతరం చెందనున్నాయి. కుప్పం మునిసిపాలిటీలో పాలకవర్గం (కౌన్సిల్‌)కు గడువు ఉండడంతో ఇక్కడ వార్డుల పునర్విభజన ఉండదు. గురువారం ప్రారంభించి ఈనెల 9వ తేదీన వార్డుల పునర్విభజన పూర్తిచేయాలి. 10వ తేదీన కొత్త వార్డుల వివరాలు ప్రచురించి 15వ తేదీ వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు కోరడం.. 17 నుంచి 26వ తేదీలోపు మునిసిపల్‌ పరిపాలన విభాగం కమిషనర్‌–డైరెక్టర్‌కు పంపాలి. ఏప్రిల్‌ 26 నుంచి మే 2వ తేదీ వరకు ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని పునర్విభజన వార్డులను ఆమోగిస్తారు. మే 3వ తేదీ నుంచి 5వ తేదీలోపు కొత్త వార్డుల స్వరూపాన్ని గెజిట్‌లో ప్రచురిస్తారు.

చిత్తూరు నగర స్వరూపంలోని ఓ భాగం

మునిసిపాలిటీ ప్రస్తుత కొత్త

వార్డులు వార్డులు

చిత్తూరు 50 60

పలమనేరు 26 40

నగరి 29 40

పారదర్శకత ఉంటుందా?

వార్డుల పునర్విభజన అంత సులువైన విషయం కాదు. మునిసిపాలిటీల్లో పట్టణ ప్రణాళిక విభాగం ఈ వ్యవహారాన్ని చూడాల్సి ఉంది. చిత్తూరు మినహా మిగిలిన మునిసిపాలిటీల్లో ప్రణాళిక విభాగంలో పూర్తి స్థాయి సిబ్బందిలేరు. పునర్విభజన సమయంలో వార్డుల్లోని సహజ సరిహద్దులు (రోడ్లు, కాలువలు) ప్రామాణికంగా తీసుకోవాలి. 2011 జనాభా ప్రకారం పునర్విభజన జరిగితే.. ఇపుడు మొదలుపెట్టిన జనగనణ–2026 లెక్కలను ఏం చేయాలి..? ఎన్నికల సమయంలో ఏ జనాభా లెక్కలు పరిగణనలోకి తీసుకోవాలి.? రిజర్వేషన్లు ఎలా వర్తింపచేయాలి..? అనే చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తుదిగా మునిసిపల్‌ ఎన్నికలపై న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నమై.. ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement