ప్రత్యేకాధికారుల పాలనలోకి పంచాయతీలు మాటవినే అధికారులనే ఎస్‌ఓలుగా నియామకం రూ.15.63 కోట్ల 15వ ఆర్థిక సంఘ నిధులు నిల్వ
‘అన్నా.. ఇన్నాళ్లూ పార్టీ జెండా మోశాం.
మీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించాం. ఇక ఉండేది రెండేళ్లే. ఇంతలోగా మేం ఏదో ఒకటి చేసుకోవాలి కదన్నా.. అందుకే ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి
అడుగుతున్నాం. మేం చెప్పినట్టు వినే
అధికారులే కావాలి. మీరు పై అధికారులతో మాట్లాడి ఆ దిశగా చర్యలు చేపట్టండి’
అంటూ పచ్చ నేతలు స్థానిక ప్రజాప్రతినిధుల పై ఒత్తిడి తెస్తున్నారు. పల్లె నిధులను అభివృద్ధి పేరుతో దిగమింగేందుకు పావులు
కదుపుతున్నారు. ప్రత్యేక అధికారుల
పాలనలో అయితే తమను అడిగే నాథుడే
ఉండడని భావిస్తున్నారు.
చిత్తూరు కార్పొరేషన్: పల్లె నిధులపై పచ్చ నేతలు కన్నేశారు. జిల్లాలోని 621 పంచాయతీల పాలకవర్గాలకు పదవీ కాలం ఏప్రిల్ 2తో ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన మొదలయ్యింది. పంచాయతీలకు మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది. ఈ నేపథ్యంలో పంచాయతీల్లో తమ పెత్తనం చెలాయించడం కోసం టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. తమ మాట వినే అధికారులను నియమించుకుని పంచాయతీల్లో ఉన్న నిధులను అడ్డంగా దోచుకునేందుకు పన్నాగం పన్నుతున్నారు.
జాబితా సిద్ధం?
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో మెజారిటీ గ్రామ పంచాయతీ సర్పంచులు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే ఉన్నారు. అప్పుడు పనిచేసిన అధికారులంటే టీడీపీ శ్రేణులకు గిట్టడం లేదు. ఏ చిన్న సమస్య అయినా వారు వాడుతున్న ఊతపదం.. ఆ ప్రభుత్వంలో మేం ఇబ్బంది పడ్డాం.. ఫలానా అధికారి మాకొద్దు అంటూ చెబుతున్నారు. కొన్ని విషయాల్లో అయితే గత ప్రభుత్వం పై బురదజల్లి ఫలానా అధికారి అలా చేశారు.. ఇలా చేశారంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులుగా మండల స్థాయి అధికారులను నియమించే అధికారం కలెక్టర్లకు అప్పగించింది. ఇప్పుడు వారి నియామకం పై టీడీపీ నేతలు దృష్టి పెట్టారు. తమకు ఫలానా అధికారి కావాలి, ఆయనుంటేనే తమ పనులు జరగుతాయంటూ కావాల్సిన వారినే నియమించుకునేలా ప్రయత్నాలు మొదలయ్యాయి. దాదాపు 150 మంది అధికారులు జాబితా సిద్ధమైనట్లు సమాచారం.
ఆ ప్రాంతాలపై దృష్టి
అధిక ఆదాయం, నగరపాలక, మున్సిపాలిటీ శివారు పంచాయతీలకు ఎస్‌ఓలుగా పనిచేసేందుకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే టీడీపీ నేతలు ఎవరిని ఎక్కడ నియమించాలన్న దానిపై కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
రూ.15.63 కోట్ల నిధులు
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఫిబ్రవరి నాటికి దాదాపు రూ.15.63 కోట్ల మేర 15వ ఆర్థిక సంఘం నిధులు నిల్వ ఉన్నాయి. ఇవిగాక వృత్తిపన్ను, తలసరి గ్రాంటు నిధులు ఉన్నాయి. ఈ నిధులను ప్రస్తుత సర్పంచులు సద్వినియోగం చేసేందుకు వీలు లేకుండా ఇటీవల చెక్‌పవర్ రద్దు చేసిన విషయం తెలిసిందే. కూటమి పాలన కావడంతో స్థానిక నేత ఒత్తిళ్లతో కార్యదర్శులు, అధికారులు నిధులు వినియోగానికి కొర్రీలు వేస్తూరావడం జరిగింది. దీంతో ప్రస్తుతం పంచాయతీల ఖాతాల్లో సాధారణ నిధులతో పాటు 15వ ఆర్థిక సంఘం నిధులు భారీగా ఉన్నాయి. ఈ నిధులను ఏప్రిల్‌లోగా సద్వినియోగం చేయాల్సి ఉంది. ఏప్రిల్ మూడో తేదీ నుంచి ప్రత్యేక పాలన రానుండడంతో ఈ నిధులను అప్పుడే తమకిష్టమైన పనులకు వాడుకోవచ్చన్న ఆశతో టీడీపీ నేతలు ఉంటున్నారు. జిల్లాలోని 621 పంచాయతీలుండగా పలు కారణాలతో నగరిలోని నంబాకం, డి.అగ్రహారం, కృష్ణరామాపురం, పెనుమూరులోని కలికిరి, పెనుమూరు, మొరవకండ్రిగ, కుప్పంలోని మళ్లనూరు. మెట్లచేను, టి.సదుమురు, రామకుప్పంలోని ననియాలతాండ, రొంపిచెర్లలోని బొమ్మాయిపల్లె, పులిచెర్లలోని ఎలింకివారిపల్లెతో కలిపి మొత్తం 12 పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు.
పల్లె నిధులపై టీడీపీ నేతల కన్ను!
మొదట అక్కడేనా?
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కూటమి పార్టీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. సాధారణంగా పార్టీ గుర్తులు లేకుండా జరిగే ఈ ఎన్నికలు గ్రామాల్లో వర్గపోరుకు దారితీసే అవకాశం ఉంది. ఈ ప్రభావం తర్వాత జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై పడే ప్రమాదం ఉందని జిల్లా నాయకులు అంటున్నారు. అందుకే ముందుగా పార్టీ గుర్తులతో జరిగే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తే కూటమి శ్రేణులు సమన్వయంతో పనిచేసి ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
బైరెడ్డిపల్లె మండలంలో రూ.51.54 లక్షలు, బంగారుపాళ్యం రూ.1.45కోట్లు, చిత్తూరు రూ.21.78 లక్షలు, జీడీనెల్లూరు రూ.1.01 కోట్లు, గంగవరం రూ.55.24 లక్షలు, గుడిపాల రూ.62.67 లక్షలు, గుడుపల్లె రూ.26.28 లక్షలు, ఐరాల రూ.45.83 లక్షలు, కార్వేటినగరం రూ.35.26 లక్షలు, కుప్పం రూ.70.72 లక్షలు, నగరి రూ.28.14 లక్షలు, నిండ్ర రూ.36.45 లక్షలు, పలమనేరు రూ.51.95 లక్షలు, పాలసముద్రం రూ.13.35 లక్షలు, పెద్దపంజాణి రూ.1.41 కోట్లు, పెనుమూరు రూ.43.05లక్షలు, పులిచెర్ల రూ.63.05 లక్షలు, పూతలపట్టు రూ.70.15 లక్షలు, రామకుప్పం రూ.89.75 లక్షలు, రొంపిచెర్ల రూ.41.34 లక్షలు, ఎస్‌ఆర్‌పురం రూ.13.52 లక్షలు, శాంతిపురం రూ.33.43 లక్షలు, తవణంపల్లె రూ.1.02 కోట్లు, వి.కోట రూ.80.64 లక్షలు, వెదురుకుప్పం రూ.20.28 లక్షలు, విజయపురం రూ.18.42 లక్షలు, యాదమరి రూ.94.87 లక్షలు.. మొత్తం రూ.15.63 కోట్ల వరకు మిగిలింది.


