ఓటీపీ లేకుండా అక్రమ విక్రయాలు ఒక్కరోజుల్లోనే 270 సిలిండర్ల హాంఫట్ సాక్షి కథనంతో విచారణ ఏజెన్సీకి షోకాజ్ నోటీసులు జారీ అక్రమాలపై గ్యాస్ కంపెనీకి నివేదికలు మరిన్ని ఏజెన్సీలపైనా విచారణ!
ఇరాన్ – ఇజ్రాయేల్ యుద్ధ ప్రభావం ఎక్కువగా గ్యాస్‌పై పడింది. సిలిండర్ల కొరత నెలకొంది. దీనికితోడు కమర్షియల్ సిలిండర్ల సరఫరా ఆగిపోయింది. ప్రభుత్వం ఓటీపీని తప్పనిసరి చేసింది. దీంతో వ్యాపారులు బ్లాక్‌లో ఎక్కువ ధరకు సిలిండర్లను కొనడానికి సిద్ధపడ్డారు. దీన్ని ఆసరాగా తీసుకున్న కొన్ని ఏజెన్సీలు అక్రమాలకు తెరలేపాయి. ఓటీపీ ధ్రువీకరణ లేకుండానే సిలిండర్లను విక్రయించాయి. ఈ విషయాన్ని సాక్షి దినపత్రిక వెలుగులోకి తీసుకురావడంతో అధికారులు పరుగులు తీశారు. విచారణలో గుడిపాలలోని ఒక ఏజెన్సీ ఒక రోజులోనే 270 సిలిండర్లను అక్రమంగా సరఫరా చేసినట్టు గుర్తించారు. అలాగే జిల్లాలోని మరిన్ని ఏజెన్సీలపైనా విచారణకు సిద్ధమయ్యారు.
సాక్షి టాస్క్‌ఫోర్స్ : గ్యాస్ సరఫరా వ్యవస్థ ఒక పెద్ద అక్రమాల పంజాలో చిక్కుకుంది. గుడిపాలలోని ఓ ఏజెన్సీ నిర్వాహకులు వినియోగదారుల ఓటీపీ ధ్రువీకరణ లేకుండానే సిలిండర్లు విక్రయించడం పెద్ద సమస్యగా మారింది. గ్యాస్ సరఫరాలో దొంగలు పడ్డారనే విషయాన్ని సాక్షి కథనం బట్టబయలు చేసింది. దీనిపై స్పందించిన అధికారులు అక్రమాలను వెలుగుతీసి గ్యాస్ కంపెనీ అధికారుల ముందు పెట్టారు. ఒక్కరోజులోనే ఒక ఏజెన్సీనే 270 సిలిండర్లను అక్రమంగా సరఫరా చేయడాన్ని గుర్తించి షాక్‌కు గురయ్యారు. ఏజెన్సీ నిర్వాహకుడికి షోకాజ్ నోటీసులిచ్చారు. సంబంధిత కంపెనీకి విచారణ అంశాలను నివేదిక రూపంలో సమర్పించారు. త్వరలో నిర్వాహకుడిపై వేటు పడే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మరిన్ని ఏజెన్సీల్లో అక్రమాలను వెలికి తీసేందుకు జిల్లా అధికారులు సిద్ధమైనట్టు తెలిసింది. దీంతో ఏజెన్సీల గుండెల్లో గుబులు పట్టుకుంది.
షోకాజ్ నోటీసులు జారీ
అక్రమాలకు పాల్పడిన ఏజెన్సీ నిర్వాహకుడికి బుధవారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. అలాగే కంపెనీకి సైతం నివేదికలు పంపారు. ఇక షోకాజ్ నోటీసుకు ఆ నిర్వాహకుడు ఇచ్చే వివరాల ఆధారంగా చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. కచ్చితంగా వేటు పడడం ఖాయమని చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న నిర్వాహకుడు అధికార పార్టీ నేతలతో అధికారులకు ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు తమ చేతుల్లో ఏమీ లేదని, ఏదైనా ఉంటే జేసీతో మాట్లాడుకోవాలని చెప్పినట్టు సమాచారం.
గుడిపాలలో గ్యాస్ ఏజెన్సీ అక్రమాలు
మరిన్ని ఏజెన్సీలపై దాడులు..?
జిల్లాలోని పలు ఏజెన్సీల్లో ఓటీపీలు లేకుండా వందలాది సిలిండర్లను దారి మళ్లించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని కొన్ని ఏజెన్సీల నిర్వాహకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అలాగే సీఎంఓ ఆఫీసుకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అక్రమాలు గుడిపాలలో మాత్రమే కాదని, జిల్లాలోని పలుచోట్ల జరిగాయని, అనుమానిత గ్యాస్ ఏజెన్సీలపై తనిఖీ చేసి గ్యాస్ దోపిడీని వెలుగులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చి నెలలో ఓటీపీ ధ్రువీకరణ లేకుండా ఎన్ని సిలిండర్లు సరఫరా చేశారు.. అన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అనుమానిత ఏజెన్సీలపై దాడులు చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చర్యలను అడ్డుకోవడానికి కొన్ని ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా గ్యాస్ బండను తమ వారు రూ.3 వేలు చేశారని అధికారులకు బహిరంగంగా చెబుతున్నారు. దీనిపై అధికారులు ఏమేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.
గుడిపాలలో మార్చి 23వ తేదీన వందలాది మంది పేరుతో ఓటీపీ ధ్రువీకరణ లేకుండా గ్యాస్ బుకింగులు జరిగాయనే విషయాన్ని సాక్షి దినపత్రిక వెలుగులోకి తీసుకు వచ్చింది. బ్లాక్ బండ పేరుతో ఆ రోజు జరిగిన వందలాది గ్యాస్ సిలిండర్ల దారి మళ్లింపు అక్రమాన్ని బట్టబయలు చేసింది. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు విచారణకు దిగారు. వాస్తవాలను తెలుసుకునేందుకు నేరుగా వినియోగదారుల దగ్గరకు వెళ్లారు. వారు తమకు జరిగిన అన్యాయాన్ని రాత పూర్వకంగా అధికారులకు అందజేశారు. అలా విచారించుకుంటూ పోగా లెక్క డబుల్ సెంచరీ దాటింది. ఒక్క రోజుల్లోనే ఓటీపీ లేకుండా 270 గ్యాస్ బండ దారి మళ్లిందని తెలుసుకున్నారు. దీంతో విచారణ పూర్తి చేసిన అధికారులు..మంగళవారం జిల్లా అధికారులకు నివేదికలు సమర్పించారు.


