తండ్రి ఒడిలోనే కూతురు మృతి | - | Sakshi
Sakshi News home page

తండ్రి ఒడిలోనే కూతురు మృతి

Mar 29 2026 7:04 AM | Updated on Mar 29 2026 7:04 AM

బస్సు కిందకు దూసుకెళ్లిన కారు

ముగ్గురి దుర్మరణం

తండ్రి ఒడిలోనే కళ్లుమూసిన చిన్నారి

ఆ దృశ్యాన్ని చూసి స్థానికుల కంటతడి

ఆ దేవుడైనా జాలిచూపలేదే అంటూ ఆవేదన

బంగారుపాళెం: మండలంలోని పాలమాకులపల్లె వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. బెంగళూరులోని సింగసంద్రలో ఉంటున్న దాపు శ్రీధర్‌ కుమార్‌(46), అతని భార్య లక్ష్మి(42), కుమారై అధ్విక(3)తో కలిసి తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కారులో బయలుదేరారు. ఉదయం 6.15 గంటల ప్రాంతంలో బంగారుపాళెం మండలం పాలమాకులపల్లె వద్ద రోడ్డుపై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొని కారు బస్సు కిందకు దూసుకుపోయింది. దీంతో ముగ్గురూ దుర్మరణం చెందారు. కారు డ్రైవర్‌ వెంకటేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. కారు ముందు సీటులో శ్రీధర్‌కుమార్‌ తన కుమార్తె అధ్వికను ఒడిలో కూర్చుని పెట్టుకున్నాడు. భార్య లక్ష్మీ వెనుక సీటులో కూర్చుంది. కారు బస్సు కిందకు దూసుకెళ్లినప్పుడు తండ్రి ఒడిలో చిన్నారి మృతి చెందిన దృశ్యం చూసిన ప్రయాణికులు, స్థానికుల కంట తడిపెట్టారు. ఆ దేవుడైనా కనికరించలేదే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

స్తంభించిన ట్రాఫిక్‌

పాలమాకులపల్లె వద్ద హైవేపై ప్రమాదం చోటు చేసుకోవడంతో పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు సుమారు రెండు గంటలు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

ఇది మూడో ప్రమాదం

పాలమాకులపల్లె వద్ద హైవేపై ఇది మూడో ప్రమాదమని స్థానికులు, వాహనదారులు తెలిపారు. పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్లే పల్లెవెలుగు బస్సులు పాలమాకులపల్లె వద్ద సర్వీసు రోడ్డు వీదుగా వెళ్లాల్సి ఉందని, డ్రైవర్లు బస్సులను హైవేపై నిలపడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గత నెల ఇక్కడే ఆర్టీసీ బస్సును కారు ఢీకొనడంతో ఐదుగురు గాయపడినట్లు చెప్పారు. అంతకు మునుపు ఆర్టీసీ బస్సు కారణంగానే ప్రమాదం జరిగిందన్నారు.

హైవేపై బస్సులు ఆపితే చర్యలు

గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సులు హైవేపై ప్రయాణికులను ఎక్కించుకో వడం, దింపడం చేస్తే చర్యలు తీసుకుంటాం. ఈ విషయాన్ని ఆర్టీసీ యాజమాన్యానికి కూడా చెప్పాం. బస్సులను సర్వేసు రోడ్డులోనే నడపాలి. బస్సులను హైవేలో నిలపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి.

– పలమనేరు డీఎస్పీ ప్రభాకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement