తవణంపల్లె: అక్రమంగా ఇంటిలోకి ప్రవేశించి మహిళపై దాడి చేసి హత్య చేయడానికి యత్నించిన కేసులో ఇద్దరు మహిళా నిందితులను శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తవణంపల్లె ఇన్‌చార్జి ఎస్‌ఐ నరసింహులు తెలి పారు. ఎస్‌ఐ కథనం మేరకు.. మండలంలోని ఒక గ్రామానికి చెందిన మహిళ గురువారం ఇంటిలో ఉండగా అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు మహిళలు వచ్చారు. రాళ్లు, ఇనుప కమ్మీ లతో దాడి చేసి హత్య చేయడానికి ప్రయత్నించారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని కుటుంబ సభ్యులు వేలూరు సీఎంసీకి తరలించారు. ఈ కేసులో నిందితులైన ఇద్దరు మహిళల ను శనివారం కె.పట్నం ఓవర్ బ్రిడ్జి దగ్గర అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు.
ఆవును కాపాడబోయి
అనంత లోకాలకు..
పూతలపట్టు(యాదమరి): పూతలపట్టు మండలంలో శనివారం ఆవును కాపాడే క్రమంలో రైతులు మృతిచెందాడు. స్థానికుల కథనం మేరకు.. ఎగువ పాలకూరు గ్రామానికి చెందిన రామకృష్ణయ్య(60) పాడి ఆవులను మేపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఎప్పటిలాగే శనివారం తన గోసంపదను మేతకు తీసుకుని గ్రామ శివారు ప్రాంతానికి వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసి తిరిగి అక్కడికి వెళ్లాడు. అక్కడ ఒక ఆవు కనిపించకపోవడంతో వెతికడం మొదలుపెట్టాడు. రాత్రి అయినా కుటుంబ పెద్ద ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. రామకృష్ణయ్య గ్రామంలోని చెరువు సమీపంలో కనిపించినట్టు ఒక వ్యక్తి చెప్పడంతో అక్కడికి వెళ్లి గాలించారు. చెరువులో నీటిపై తేలుతున్న మృతదేహం కనిపించింది. పరిశీలించగా రామకృష్ణయ్య గా గుర్తించారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు వివరణ కోరగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు.
వైఎస్సార్ సీపీ నాయకుడిపై దాడి
కార్వేటినగరం : మండలంలోని ముక్కరవానిపల్లెలో శనివారం సాయంత్రం వైఎస్సార్ సీపీ నాయకుడిపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి దాడి చేశాడు. స్థానికుల కథనం మేరకు.. ముక్కరవానిపల్లికి చెందిన మురళీకృష్ణారెడ్డికి, తిరుమల రెడ్డికి భూ వివాదం ఉంది. గతంలో గ్రామస్తులు, రెవెన్యూ అధికారులు సరిహద్దు రాళ్లు నాటి వివాదాన్ని పరిష్కరించారు. దీంతో మురళీకృష్ణారెడ్డి ఆ స్థలానికి పెన్సింగ్ వేసుకున్నాడు. తిరుమలరెడ్డి శనివారం పెన్సింగ్‌ను తొలగించాడు. దీంతో మురళీకృష్ణారెడ్డి, తిరుమల రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు గ్రామ పెద్ద లు, టీడీపీ కార్యకర్తలు రచ్చబండ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తిరుమలరెడ్డి రెచ్చిపో యి మురళీకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. బాధితుడు మురళీకృష్ణారెడ్డి కార్వేటినగరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 30 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 67,526 మంది స్వామిని దర్శించుకున్నారు. 25,780 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.45 కోట్లు వచ్చాయి. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని వారికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకుంటున్నారు. సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించేది లేదని తెలిపారు.


