వారం రోజుల్లో 25 జెడ్పీ హైస్కూళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు డ్రగ్స్ సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1972 కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ
చిత్తూరు కలెక్టరేట్ : మాదకద్రవ్యాలు లేని జిల్లాగా మారుద్దామని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఆయన బుధవారం జిల్లా ఎస్పీ తుషార్‌డూడితో కలిసి చిత్తూరు జిల్లాలో మాదకద్రవ్యాలు, గంజాయి నియంత్రణ చర్యలపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తుకు వెన్నెముక వంటి యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. జిల్లాలోని 25 జెడ్పీ హైస్కూళ్ల పరిసరాల్లో వారం రోజుల్లోపు రూ.2 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో మత్తు పదార్థాల వల్ల కలిగే చట్టపరమైన ఇబ్బందులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే డ్రాయింగ్, వ్యాసరచన, వ్యక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు. ప్రతి కళాశాలలో ఒక నోడల్ అధికారిని నియమించి హాస్టళ్లలో అవగాహన పోస్టర్లను ప్రదర్శించాలన్నారు. విద్యార్థులకు టొబాకో ఉత్పత్తులు విక్రయించే వారిపై దాడులు చేయాలని పోలీస్, ఫుడ్ సేఫ్టీ, ఈగల్ టీమ్స్‌ను ఆదేశించారు. నగరి, కుప్పం సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాలని, ఆన్‌లైన్‌లో అక్రమంగా మందులను ఆర్డర్ చేసి విక్రయించే మెడికల్ షాపులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డ్రగ్స్, గంజాయి సమాచారం తెలిస్తే ప్రజలు వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని సూచించారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
దేశాన్ని ప్రేమించే వారు డ్రగ్స్ ముట్టుకోరు: ఎస్పీ తుషార్ డూడి
ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ ‘దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ జోలికి వెళ్లడు‘ అని అన్నారు. జిల్లాను డ్రగ్ రహితంగా మార్చేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ముఖ్యంగా గంజాయి సాగుపై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, ఈగల్ టీమ్స్ క్షేత్రస్థాయిలో నిఘా ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్, ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసు, డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ కీర్తన, వ్యవసాయ శాఖ జేడీ మురళి, ఈగల్ ప్రతినిధి గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.


