యువతే దేశానికి అసలైన సంపద | - | Sakshi
Sakshi News home page

యువతే దేశానికి అసలైన సంపద

Mar 26 2026 7:46 AM | Updated on Mar 26 2026 7:46 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : యువతే దేశానికి అసలైన సంపదని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ తెలిపారు. చిత్తూరులోని విజయం ఇంజినీరింగ్‌ కళాశాలలో బుధవారం నెహ్రూ యువజన శాఖ ఆధ్వర్యంలో కాశ్మీర్‌ యూత్‌ ఎక్స్‌ఛేంజ్‌ కార్యక్రమం నిర్వహించారు. కాశ్మీర్‌లోని 6 జిల్లాల నుంచి వచ్చిన 132 మంది యువతీ యువకులకు జిల్లా యంత్రాంగం సాదర స్వాగతం పలికింది. ఇందులో ముఖ్య అతిథిగా కలెక్టర్‌ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారని తెలిపారు. భారత్‌ మాత్రం అపారమైన యువశక్తితో విరాజిల్లుతోందన్నారు. భారతదేశంలో ఖనిజాలు, గనుల కంటే అత్యంత విలువైనది యువతరమన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ ప్రత్యేకత అని చెప్పారు. విభిన్న ఆచారాలు ఉన్నప్పటికీ భారతీయుల ఐక్యత ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోందన్నారు. దేశంలో అలజడులు సృష్టించే శక్తుల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి యువకుడు శాంతిని కాపాడే పీస్‌ అంబాసిడర్‌గా ఎదగాలని సూచించారు. ట్రైనీ కలెక్టర్‌ నరేంద్ర పడాల్‌ మాట్లాడుతూ యువత ఉగ్రవాదం, నక్సలిజం వంటి దేశద్రోహ చర్యలు, డ్రగ్స్‌ వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని చెప్పారు. మై భారత్‌ స్టేట్‌ డైరెక్టర్‌ అన్సుమన్‌ ప్రసాద్‌ దాస్‌ మాట్లాడుతూ కాశ్మీర్‌ యూత్‌ ఎక్స్‌ఛేంజ్‌ కార్యక్రమం ఈ నెల 24 నుంచి 29 వరకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కాశ్మీర్‌ యువత ఇక్కడి తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను తెలుసుకుంటారని చెప్పారు. స్థానిక పర్యాటక, చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శిస్తారని తెలిపారు. రెండు ప్రాంతాల యువత మధ్య భావవినిమయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విజయం విద్యాసంస్థల చైర్మన్‌ తేజోమూర్తి, అకడమిక్‌ డైరెక్టర్‌ శైలజ, ఏవో రాజగోపాల్‌, మై భారత్‌ జిల్లా యువ అధికారి ప్రదీప్‌, అకౌంట్స్‌ ఆఫీసర్‌ బాబురెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement