చిత్తూరు అర్బన్: చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని పూణేపల్లి వద్ద నిర్మించిన టిడ్కో ఇళ్లను ఈనెల 30వ తేదీన లబ్ధిదారులకు అందజేయనున్నట్లు కమిషనర్ పి.నరసింహప్రసాద్ తెలిపారు. బుధవారం టిడ్కో ఇళ్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని సమీక్షిస్తూ, మౌలిక వసతులు, సదుపాయాలపై అధికారులతో మాట్లాడారు. లబ్ధిదారులకు అవసరమైన తాగునీరు, విద్యుత్, రోడ్లు వంటి మౌలిక వసతులు పూర్తి స్థాయిలో కల్పించాలని సూచించారు. కమిషనర్ వెంట ప్రజారోగ్యశాఖ అధికారి లోకేష్, మునిసిపల్ ఇంజినీరు వెంకటరామిరెడ్డి, టిక్కో డీఈ వెంకటముని, ఏఈ ధనంజయరెడ్డి ఉన్నారు.
పోలీస్ స్టేషన్‌కుడ్రోన్ కెమెరా అందజేత
చిత్తూరు అర్బన్: గంగాధరనెల్లూరు పోలీస్ స్టేషన్‌కు డ్రోన్ కెమెరాను చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ అందించారు. గంగాధరనెల్లూరుకు చెందిన బిల్డర్ ప్రసన్నకుమార్ విరాళంగా ఇచ్చిన ఈ కెమెరాను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్ ప్రసాద్‌కు అందచేశారు. శాంతి భద్రతల పర్యవేక్షణకు దీన్ని ఉపయోగించాలని ఎస్పీ ఆదేశించారు.
అపోలోలో వరల్డ్ ఆప్టోమెట్రీ డే
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరం మురకంబట్టులోని ది అపోలో యూనివర్సిటీ పరిధిలోని స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్, డివిజన్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో వరల్డ్ ఆప్టోమెట్రీ డే–2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కంటి ఆరోగ్య ప్రాముఖ్యత, నాణ్యమైన విజన్ కేర్ సేవలపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా వీసీ వినోద్ భట్ హాజరై ప్రసంగించారు. గౌరవ అతిథిగా అదనపు రిజిస్ట్రార్ అనీల్ కుమార్‌తోపాటు వైద్య నిపుణులు ఆల్ఫ్రెడ్ జె అగస్టీన్, భాస్కర్ రెడ్డి, సుచరిత, కుమార్ అమత్, రాకేష్ కుమార్ యాదవ్, అఖిల్ పాల్గొన్నారు.


