అర్ధంతరంగా ఆగిన పశువైద్యశాల భవన నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

అర్ధంతరంగా ఆగిన పశువైద్యశాల భవన నిర్మాణం

Mar 26 2026 7:46 AM | Updated on Mar 26 2026 7:46 AM

● మంజూరు కాని నిధులు ● ముందుకు సాగని పనులు ● ఇబ్బందులు పడుతున్న రైతులు

గంగాధర నెల్లూరు: మండలంలోని నందనూరు గ్రామంలోని పశువైద్యశాల భవన నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. నిధులు విడుదల కాకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్‌ పనులు చేయలేమని చేతులెత్తేశాడు. దీంతో రైతులు తమ పశువులకు వైద్య సేవలు అందించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రమైన గంగాధరనెల్లూరులోని పశువైద్యశాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. మండలంలోని నందనూరు పంచాయతీలో పశు వైద్యశాల భవనం నిర్మాణం కోసం గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం దాదాపు రూ.20 లక్షలు మంజూరు చేసింది. అదే గ్రామానికి చెందిన కాంట్రాక్టర్‌ పనులు చేపట్టాడు. గోడలు పూర్తి చేసి పైకప్పుకూడా వేశాడు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిధులు మంజూరుకాలేదు. దీంతో పనులు చేయలేనని కాంట్రాక్టర్‌ చేతులెత్తేశాడు. ఈ వైద్యశాల పూర్తయితే నందనూరు, కలిజవేడు, పాపిరెడ్డి పల్లి, కొట్రకోన, పెనుమూరు సరిహద్దులోని పలు గ్రామాల రైతులకు అనుకూలంగా ఉంటుంది. పశువైద్యశాల భవనం అర్ధంతరంగా ఆగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వైద్య సేవలను తాత్కాలికంగా గ్రామపంచాయతీ భవనం వద్ద నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ 50కి పైగా పాడి ఆవులు వైద్య సేవల కోసం తీసుకువస్తున్నారు. పంచాయతీ కార్యాలయం వద్ద పశువులకు సంబంధించిన మందులు, రికార్డులను ఉంచుకునేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి నిధులు మంజూరు చేయించి పశువైద్యశాల భవన నిర్మాణ పనులు పూర్తి చేయించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement