పుత్తూరు: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) అమలుచేస్తున్న నవజీవన్‌శ్రీ పాలసీ(911)ని ఈ నెల 31వ తేదీ నుంచి నిలిపివేస్తున్నట్లు స్థానిక బ్రాంచి మేనేజర్ పి.ఎస్.హేమాద్రి తెలిపారు. ఆయన బుధవారం తమ సిబ్బందితో కలిసి నవజీవన్‌శ్రీ పాలసీపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నవజీవన్‌శ్రీ పాలసీ కింద సింగిల్ ప్రీమియం చెల్లించడం ద్వారా జీవితానికి భద్రత పొందవచ్చునని తెలిపారు. గ్యారెంటీ అడిషన్ లాభం కూడా ఉంటుందని పేర్కొన్నారు. జీరో వయస్సు నుంచి 65 ఏళ్ల వారు పాలసీ చేసుకోవచ్చని వెల్లడించారు. కుటుంబ భద్రత, పిల్లల భవిషత్తు కోసం ఇది ఎంతగానో దోహద పడుతుందని పేర్కొన్నారు.
భారీ జరిమానా
యాదమరి: మండల పరిధిలోని వరిగపల్లి వద్ద ఇటీవల పోలీసులు అక్రమ రవాణా చేస్తున్న పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సేల్స్ ట్యాక్స్ అధికారులు నిందితులకు రూ.9 లక్షల భారీ జరిమానా వసూలు చేసి, వాహనాన్ని విడుదల చేసినట్లు స్థానిక ఎస్‌ఐ ఈశ్వర్ తెలిపారు.
కారు ఢీకొని యువకుడికి గాయాలు
గంగవరం: మండలంలోని అప్పినపల్లి క్రాస్ వద్ద బుధవారం బైక్‌ను కారు ఢీకొనడంతో యువకుడు గాయపడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కల్లుపల్లి గ్రామానికి చెందిన బాబు కుమారుడు గోకుల్‌సాయి(19), ఇదే గ్రామానికి చెందిన మరో యువకుడు ద్విచక్ర వాహనంలో పలమనేరు వైపు వెళ్తున్నారు. అదే మార్గంలో మదనపల్లి వైపు వస్తున్న కారు అప్పినపల్లి క్రాస్ వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో గోకుల్‌సాయికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుని చికిత్స నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.


