చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో మామిడి దిగుబడి అంచనాను ఉద్యాన శాఖ అధికారులు పూర్తి చేశారు. తోతాపురి 40024 హెక్టార్లకు 483981 మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చునని అంచనా వేశారు. అలాగే బేనీషా 6856 హెక్టార్లకు 42242 టన్నులు, కాదర్ 2702 హెక్టార్లకు 18834 టన్నులు, నీలం 5178 హెక్టార్లకు 42242 టన్నులు, మల్లిక 1349 హెక్టార్లకు 10444 టన్నులు, ఇత ర రకం 3217 హెక్టార్లకు 23509 టన్నుల దిగుబడి ఉండవచ్చునని ముందస్తుగా గుర్తించారు. మొత్తంగా 59326 హెక్టార్లు ఉండగా సుమారు 621252 హెక్టార్లల్లో దిగుబడి వస్తుందని ఉద్యాన శాఖ అధికారులు వెల్లడించారు.
క్షయవ్యాధి నిర్మూలనే లక్ష్యం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): రానున్న రెండు సంవత్సరాల్లో చిత్తూరు జిల్లాలో క్షయవ్యాధి కేసులను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ తెలిపారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం చిత్తూరు నగరంలోని గాంధీ సర్కిల్ వద్ద నిర్వహించిన జాతీయ క్షయ నిర్మూలన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంతో పోలిస్తే ప్రస్తుతం టీబీ నిర్ధారణ సదుపాయాలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. జిల్లాలో సుమారు 2,500 నుంచి 3,000 వరకు యాక్టివ్ కేసులు ఉన్నాయని, వీరికి సమయానికి మందులు అందజేస్తున్నామని తెలిపారు. సరైన సమయంలో చికిత్స ప్రారంభించి, ఆరు నెలలపాటు క్రమం తప్పకుండా మందులు తీసుకుంటే టీబీ పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి వెంకట ప్రసాద్, చుడా చైర్మన్ కఠారి హేమలత, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.
కార్పొరేట్‌కు
ప్రభుత్వ భూములు
– సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ అధ్యక్షుడు నారాయణ
నగరి: రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు వందల ఎకరాలు దోచిపెడుతోందని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ అధ్యక్షుడు నారాయణ అన్నారు. పేదలకు పట్టాలు పంపిణీ చేయాలంటూ మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా నగరి టవర్ క్లాక్ సెంటర్ నుంచి నిర్వహించిన ర్యాలీ, ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన ఇంటి స్థలాల హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్లకు వందల ఎకరాలు దోచిపెడుతున్న ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తోందన్నారు. దీనిపై తహశీల్దార్ మాట్లాడుతూ కచ్చితంగా అందరికీ పట్టాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, జిల్లా సహాయ కార్యదర్శి శివారెడ్డి, పార్టీ నాయకులు మురళి, శిరావుద్దీన్, యేసయ్య, రాజేంద్రన్, సతీష్. నాగరాజు, ఏఐటీయూసీ నాయకులు పార్వతి, కుట్టి, సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు.


