వేధిస్తున్న సిబ్బంది కొరత కొరవడిన పర్యవేక్షణ అలంకారప్రాయంగా మారిన జిల్లా
చిత్తూరు కార్పొరేషన్: మనం తీసుకొనే ఆహార పదార్థాలకు సంబంధించి జిల్లా సహాయ ఆహార నియంత్రణ శాఖ పరిధిలోకి వస్తాయి. మనిషి ఆరోగ్య పరిరక్షణలో ఈశాఖ పాత్ర కీలకం. అలాంటి సంస్థ సమస్యలతో కొట్టు మిట్టాడుతోంది. ఉద్యోగుల కొరత, పని ఒత్తిడి, ప్రైవేటు ఉద్యోగుల హల్‌చల్, లైసెన్స్, రిజిస్ట్రేషన్ ఫీజులు, శాంపిల్స్ సేకరణలో దోపిడీ జరుగుతున్నట్లు విమర్శలు ఉన్నా యి. లోటుపాట్లను అవకాశంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఆహార తనిఖీ వాహనం చిత్తూరు జిల్లాకు మంజూరు చేస్తే పలు ఆహార పదార్థాల ఫలితాలు అప్పుడే తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆ దిశగా పనులు జరగడం లేదు.
సంస్థ లక్ష్యం ఇదీ..
హోటళ్లు, బేకరీలు, గోధుమ, పసుపు, నూనెలు, పండ్ల వ్యాపారాలు తదితర ఆహార పదార్థాల విక్రయ తయారీ కేంద్రాల్లోని కల్తీలను ఆహార నియంత్రణ శాఖ పరిశీలించాలి. అందుకు సంబంధించి జిల్లాలో రెండు డివిజన్లు ఉన్నాయి. చిత్తూరు డివిజన్‌లో చిత్తూరు, పూతలపట్టు, జీడీ నెల్లూరు, పలమనేరు నియోజకవర్గాలు రాగా, కుప్పం డివిజన్ పరంగా కుప్పం నియోజకవర్గంతో పాటు జిల్లాలోని నగరి, పుంగనూరు మండలాలు వస్తాయి ఫిర్యాదులు వచ్చినా లేదా ఏదైనా అనుమానం ఉన్నా తనిఖీలు చేపడతారు. అలాగే ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటారు.
నెలకు 12 నమూనాల పరిశీలన
వివిధ పదార్థాలు..వస్తువుల నుంచి నెలకు 12 శ్యాంపిల్స్ తీయాలి. ఒక శ్యాంపిల్‌తో పాటే అదనంగా రెండు తీసుకుంటారు. ఆ ప్రకారం ఒక నెలకు మొత్తం 36 శ్యాంపిల్స్ తీస్తారు. ఒక్కో శ్యాంపిల్ చొప్పున కల్తీ నిర్ధారణ పరీక్షల కోసం హైదరాబాద్‌లోని నాచారంలోని లేబొరేటరీకి పంపిస్తారు. అక్కడ నుంచి వచ్చిన నివేదికల ప్రకారం ఇక్కడి అధికారులు చర్యలు తీసుకుంటారు. ఉదాహరణకు పరీక్షల్లో నాసిరకం అని తేలితే శ్రీసబ్ స్టాండెడ్, మిస్ బ్రాండెడ్ అని అంటారు. దీనికి జిల్లా జాయింట్ కలెక్టర్ స్థాయిలో విచారణ జరుగుతుంది. అలాగే తినడానికి వీలులేని పదార్థాలు, వస్తువులను శ్రీఆన్‌సేఫ్‌శ్రీ అంటారు. దీనికి న్యాయ స్థానం శిక్ష ఖరారు చేస్తుంది. సంబంధిత వ్యక్తికి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు భారీగా జరిమానా పడటంతో పాటు రెండేళ్ల జైలు శిక్ష కూడా పడుతుంది. అదే విధంగా ఈశాఖ ప్రభుత్వ రంగ సంస్థలైన హాస్టళ్లు, ఐసీడీఎస్ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న ఆహార పథకాలను కూడా పర్యవేక్షించే అధికారం ఉంది.
సిబ్బంది కొరత
కీలకమైన ఈ శాఖకు సిబ్బంది కొరత శాపంగా మారింది. జూనియర్ సహాయకులు, సీనియర్ సహాయకులు, అటెండర్ల లేమితో అవస్థలు పడుతున్నారు. పని ఒత్తిడి పేరుతో అధికారులు పనులను ఆలస్యం చేస్తున్నారు. ఏడాది కాలంలో చిత్తూరు డివిజన్‌లో 77, కుప్పం డివిజన్‌లో 102 తనిఖీలు చేశారు. నిబంధనల ప్రకారం 240 చేయాల్సి ఉంది. ఇందులో 10 సబ్‌స్టాండ్, 4 ఆన్‌సేప్ కేసులు నమోదు చేయగా వారి వద్ద నుంచి రూ.3 లక్షలకు పైగా జరిమానాలు విధించారు. జిల్లా మొత్తానికి ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు మాత్రమే ఉన్నారు. మరో ఇన్‌స్పెక్టర్ అవసరం ఉన్నా కేటాయింపులు లేవు.
తక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు
జిల్లా వ్యాప్తంగా కుప్పలు, తెప్పలుగా హోటళ్లు , రెస్టారెంట్లు, తినుబండరాలు, వస్తువులను తయారు చేసే కేంద్రాలు లెక్కలేనన్ని ఉన్నాయి. కాగా ఈ శాఖ పరిధిలో అధికారికంగా లైసెన్స్, రిజిస్ట్రేషన్ కలిగిన సంస్థలు తక్కువ సంఖ్యలో ఉండడం గమనార్హం. లైసెన్స్ పరిధిలోకి పెద్ద హోటళ్లు, నూనె తదితర ఆహార పదార్థాల తయారీ కేంద్రాలు వస్తాయి. రిటైల్ డిస్ట్రిబ్యూటర్లు తదితర వ్యాపార కేంద్రాలు వస్తాయి. రిజిస్ట్రేషన్ పరిధిలో చిన్న హోటళ్లు ఉంటాయి. అధికారికంగా అన్నింటిని కలుపుకున్నా లైసెన్స్, రిజిస్ట్రేషన్ కలిగినవి తక్కువ సంఖ్యలోనే కనిపిస్తున్నాయి.
కుప్పం నియోజకవర్గంలో పంచనామా నిర్వహిస్తున్న విశ్రాంత ఉద్యోగి, ప్రైవేటు డ్రైవర్ (ఫైల్)
ఆహారభద్రత ప్రమాణాల శాఖ కార్యాలయం
ఏడాది కాలంలో తీసిన శాంపిల్స్ 179
అందులో సబ్‌స్టాండ్ 10
అన్‌సేఫ్ 4
మొత్తం లైసెన్స్ డీలర్లు 550
రిజిస్ట్రేషన్ డీలర్ల్లు 1000
కలగా మారిన ‘కల్తీ నియంత్రణ’
సహాయ ఆహార నియంత్రణ శాఖ
ప్రతిదానికి వసూళ్లు ?
ఏడాదికి రూ.12 లక్షలు కంటే తక్కువ వ్యాపారం చేసేవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వీటికి ప్రభుత్వం రుసుం రూ.100 ఏడాదికి కానీ రూ.2 వేలు అప్పనంగా తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే రూ.12 లక్షలు పైగా జరిగే వ్యాపారాలకు లైసెన్స్ ఫీజు రూ.2 వేలు వీటికి రూ.5 వేలు తక్కువ కాకుండా తీసుకుంటున్నారని వ్యాపారులు చెబుతున్నారు. అంతే కాదు నెలవారీ తనిఖీలకు వెళ్లినప్పుడు శాంపిల్స్ సేకరిస్తారు. అందులోనూ లైసెన్స్‌దారుల నుంచి వేలకు వేలు పిండుతున్నారని వాపోతున్నారు. తనిఖీల్లో భాగంగా మూడు శాంపిల్స్ తీస్తారు ఇందులో ఆన్‌సేఫ్ అని వస్తే బాధితుడు చాలెంజ్ చేసుకోవడానికి నెలరోజులు సమయం ఉంటుంది. కానీ చాలెంజ్ చేసినప్పుడు సెంట్రల్ ల్యాబ్‌లో తిరిగి పరీక్షలకు పంపినప్పుడు ఎటువంటి సమస్య లేదనే వస్తోందని సమాచారం. వసూళ్లతో అధికారులు బేరం కుదుర్చుకొని మేనేజ్ చేస్తున్నారనే అపవాదు ఉంది. అంతే కాకుండా అధికారులు డ్రైవర్లను అడ్డుగా పెట్టుకొని దోపిడీకి తెరలేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరుకు తనిఖీలు, శాంపిల్స్ సేకరణ, పంచనామాకు సైతం విశ్రాంత ఉద్యోగి, డ్రైవర్ ద్వారా చేయిస్తున్నారు. డీలర్లపై వారి పెత్తనం పెరిగింది. వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది.


