ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే జైలు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే జైలు

Mar 20 2026 8:06 AM | Updated on Mar 20 2026 8:06 AM

● హైకోర్టు కఠిన హెచ్చరిక ● నోటీసులు జారీచేసి

ఆక్రమణలు తొలగించండి

గంగాధరనెల్లూరు: శ్రీసిద్ధేశ్వర స్వామి కొండ గ్రామంలో ప్రభుత్వ గయాలు భూమిలో ఉన్న దేవదాయ భూములను ఆక్రమించిన వారిపై ఎట్టకేలకు హైకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం వింజం రెవెన్యూ గ్రామం సర్వే నెం.296లో ఉన్న ప్రభుత్వ గయాలు భూమి ఆక్రమణల అంశంపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. ఈ కేసులో పిటిషనర్ల తరఫున అడ్వకేట్‌ పసపల సుధాకర్‌రెడ్డి బలమైన వాదనలు వినిపించారు. మొదటి వాయిదా విచారణలో గయాలు భూమిలో సుమారు నాలుగు ఎకరాల మేర ఆక్రమణ జరిగినట్టు, ముఖ్యంగా సతీష్‌కుమార్‌, సాగి కుమార్‌ ఆక్రమించారని రికార్డులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తదుపరి వాయిదాలో తహశీల్దార్‌ పూర్తి రికార్డులతోపాటు సంబంధిత భూ స్కెచ్‌ను నేరుగా కోర్టుకు సమర్పించి, భూమి స్వరూపం, సబ్‌డివిజన్‌ జరిగిన భాగాలు, మిగిలిన గయాలు భూమి వివరాలను ఒరిజినల్‌ రికార్డును కోర్టుకు తీసుకురావాలని న్యాయస్థానం ఆదేశించింది. విచారణకు వచ్చిన.డబ్ల్యూపి నెం.3565/2026 కేసులో, జీడీనెల్లూరు మండల డిప్యూటీ తహశీల్దార్‌ కోర్టుకు హాజరై ఒరిజినల్‌ రికార్డులను సమర్పించారు. 1977లో సర్వే నం.296పై సబ్‌డివిజన్‌ జరిగినట్లు, మిగిలిన 45.18 ఎకరాల గయాలు భూమిలో కొండ ప్రాంతంగా ఉన్నట్లు తెలిపారు. ఆ భూమిలో కొంత భాగం వ్యక్తులు ఆక్రమించినట్లు కోర్టుకు తెలియజేయగా, ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తామని అధికార ప్రతినిధి పేర్కొన్నారు. కోర్టు ఆక్రమణదారులకు సెక్షన్‌ 7–6 కింద నోటీసులు జారీ చేసి ఆక్రమణలను తొలగించే చర్యలు తీసుకోవాలని సూచించారు. నోటీసులు జారీ చేసిన వివరాలను తదుపరి విచారణలో సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు కేసును 09.03.2026 తేదీకి వాయిదా వేసింది. ప్రజా ప్రయోజనాలకు చెందిన ఈ భూమి భవిష్యత్తులో మరలా ఆక్రమణకు గురికాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు దృష్టికి పసపల సుధాకర్‌రెడ్డి న్యాయవాది తీసుకువచ్చారు. శ్రీసిద్ధేశ్వర స్వామి గ్రామానికి చెందిన హిందూ సంఘాలు పలుమార్లు రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఎట్టకేలకు హైకోర్టు ఆక్రమణదారులపై మొట్టికాయలు వేయడంతో న్యాయం గెలిచిందని సంతోషపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement