పుష్పాలంకరణతో ఆకట్టుకున్న వరసిద్ధుడి ఆలయం
కాణిపాకం: ఉగాది సంబరం అంబరమంటిది. పరాభవ నామ నామసంవత్సరానికి గురువారం జిల్లావాసులు ఘన స్వాగతం పలికారు. ఇళ్ల వాకిళ్లకు మామిడి ఆకులు, పూలతోరణాలు కట్టి అందంగా ముస్తాబు చేశారు. ఉదయాన్నే స్నానం చేసి కొత్త దుస్తులు ధరించారు. సమ్మేళనమై ఉగాది పచ్చడిని రుచి చూశారు. భక్తుల రాకతో ఆలయం ఉగాది శోభను సంతరించుకుంది. కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక ఆలయంలో ఉగాది వేడుకలు అంబరాన్నంటాయి. ఆలయాన్ని విదేశీ పుష్పాలతో సుందరంగా అలకరించారు. ఉదయం నుంచి రాత్రి వరకు అభిషేక, పూజలు కొనసాగాయి. పంచాంగ శ్రవణాన్ని పురోహితులు పఠించారు. ముందుగా ఉత్సవమూర్తులు విశేష అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మురళీమోహన్, ఈవో పెంచల కిషోర్, చైర్మన్ మణినాయుడు, వేదపండితులు పంచాంగ శ్రవణ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ శాంతి సాగర్‌రెడ్డి పాల్గొన్నారు.
భక్తులు కిటకిట
కాణిపాకం ఆలయం వేకువజాము నుంచే భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం కావడం, ఉగాది పర్వదినం తోడవడంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. వేకువ జామునుంచే భక్తులు క్యూకట్టారు. రాత్రి వరకు కూడా రద్దీగా కనిపించింది.
భక్తుల రద్దీ
పంచాంగ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు


