– స్విమ్స్
యాజమాన్య
నిర్లక్ష్యంపై
కార్మికుల ఆగ్రహం
తిరుపతి తుడా: రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది పండుగను ఆనందంగా జరుపుకుంటున్న వేళ స్విమ్స్ ఆస్పత్రిలో సేవలందిస్తున్న 800 మంది కార్మికులు చేపట్టిన ఆకలి పోరాటం 22వ రోజుకు చేరుకుంది. పండుగ రోజున కూడా తమ దీక్షా శిబిరం వద్దే తమ పూజలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు కే వేణుగోపాల్ మాట్లాడుతూ కొత్త సంవత్సరాన్ని స్వాగతించే రోజున ప్రజలు ఇళ్లలో సంతోషం నిండిపోతుంటే, స్విమ్స్ కార్మికుల ఇళ్లలో మాత్రం ఆకలి, ఆందోళన మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. 22 రోజులుగా శాంతియుతంగా దీక్షలు చేస్తున్నా, కార్మికులను చర్చలకు పిలవకుండా యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేవలం రూ.13,500 తక్కువ వేతనంతో జీవనం సాగిస్తున్న కార్మికులు పండుగ రోజున కూడా తమ పిల్లలకు కనీస అవసరాలు తీర్చలేని స్థితిలో ఉన్నారని తెలిపారు. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న రోగులకు సేవలు అందించే వార్డ్ బాయ్‌లు, పేషెంట్ కేర్ అసిస్టెంట్లను ‘శానిటేషన్ కార్మికులు’గా తక్కువ చేసి చూడడం అమానుషమన్నారు. ఇతర టీటీడీ అనుబంధ సంస్థల్లో ఉన్నట్లే గౌరవం, వేతనాలు స్విమ్స్ కార్మికులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అధికారుల మొండి వైఖరి కారణంగా వందలాది కుటుంబాలు పండుగ రోజున కూడా కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరింపులు, ఒత్తిళ్లతో ఈ పోరాటాన్ని ఆపలేరని, వెంటనే హోదా మార్పు చేసి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రవి, గోపి, సూరి, వెంకటేష్, బాలకృష్ణ, రాజా తదితరులు పాల్గొన్నారు.


