చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో మంగళవారం కరెంటోళ్ల జనబాట చేపట్టారు. జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను గుర్తించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్ల పరంగా 30 సమస్యలు, డీటీఆర్ 1, ఎల్‌టీ లైన్ల పరంగా 90, సర్వీసు లైన్లకు 18 కలిపి మొత్తం 139 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్ తెలిపారు.
ఆస్తి పన్నుపై వడ్డీ బాదుడు!
చిత్తూరు అర్బన్: మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను చెల్లింపుపై వడ్డీ మాఫీని 50శాతానికే పరిమితం చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 31వ తేదీ లోపు ఆస్తి పన్ను మొత్తం ఒకేసారి చెల్లించిన వాళ్లకు.. అప్పటి వరకు ఉన్న వడ్డీపై 50 శాతం మాఫీ చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఆస్తి పన్నుపై మొత్తం వడ్డీ మాఫీ చేస్తారని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆస్తి పన్నుపై దాదాపు రూ.26.02 కోట్లు వడ్డీ ఉండగా.. ఇందులో 50 శాతం మాఫీ చేసిన తర్వాత ప్రజలపై రూ.13 కోట్ల వడ్డీ భారం పడుతోంది. అలాగే కుప్పం మున్సిపాలిటీలో రూ.97 లక్షలు, పలమనేరులో రూ.14 లక్షలు, నగరిలో రూ.68 లక్షలు వడ్డీని ప్రజలు భరించాల్సి వస్తోంది. మొత్తం రూ.14.8 కోట్లు వడ్డీని తప్పనిసరిగా చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
విద్యుత్ సర్వీసుల
విడుదలకు ఆదేశం
చిత్తూరు కార్పొరేషన్: ట్రాన్స్‌ఫార్మర్లు స్టాకు వస్తోందని వ్యవసాయ విద్యుత్ సర్వీసులను సకాలంలో విడుదల చేయాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్ ఆదేశించారు. మంగళవారం ఎస్‌ఈ కార్యాలయంలో చిత్తూరు అర్బన్, రూరల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రెండు డివిజన్ల పరిధిలో దాదాపు 1000 వ్యవసాయ సర్వీసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలన్నారు. వేసవి నేపథ్యంలో ట్రాన్స్‌ఫార్మర్ల నిల్వలు పెంచుకోవాలని సూచించారు. ప్రస్తుతం నెలకు 400 పైగా ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతుకు గురవుతున్నాయని, ఏప్రిల్ ఆ సంఖ్య మరింత పెర గే ప్రమాదముందని హెచ్చరించారు. ఆ సమయంలో రైతులు ఇబ్బంది పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే విద్యుత్ చౌర్యంపై ప్రత్యేక నిఘా పెట్టాని ఆదేశించారు. సమావేశంలో ఈఈలు మునిచంద్ర, సురేష్, హరి పాల్గొన్నారు.
హోటల్‌లో గ్యాస్ చార్జీలు!
చిత్తూరు అర్బన్: చైన్నెలోని హోటళ్లలో భోజ నం చేసినా, పార్శిల్ తీసుకెళ్లినా గ్యాస్ చార్జీలు వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటన చిత్తూరు నగరంలోనూ జరిగింది. నగరంలోని ఓ హోటల్‌లో మంగళవారం ఉదయం టిఫిన్ పార్శిల్ తీసుకున్న వ్యక్తికి యాజమాన్యం షాక్ ఇచ్చింది. గ్యాస్ పేరిట అదనంగా మరో రూ.10 బిల్లులో చేర్చింది. దీంతో వినియోగదారులు ఆ హోటల్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


