చిత్తూరు కలెక్టరేట్ : యువతకు సీడాప్ జాబ్ కనెక్ట్ ఓ వరమని డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి వెల్లడించారు. మంగళవారం చిత్తూరులోని టీటీడీసీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సీడాప్ జాబ్ కనెక్ట్ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పీడీ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన అవకాశాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లా మేనేజర్ సరితారెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులు, పరిశ్రమలకు వారధిలా పనిచేయడమే సీడాప్ జాబ్ కనెక్ట్ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. జాబ్ మేళాకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి మొత్తం 170 మంది హాజరయ్యారన్నారు. 6 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి 102 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్నట్లు వివరించారు.


