అనుభవం లేని వారికి చీఫ్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు గంగవరం, పలమనేరు ప్రాంతాల్లో సమస్యలు ఇన్విజిలేషన్ విధులు వొద్దు అంటే బెదిరింపులు 8 పరీక్ష కేంద్రాలు తనిఖీ చేసిన అబ్జర్వర్ మువ్వా రామలింగం మొదటి రోజు 252 మంది విద్యార్థులు గైర్హాజరు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్ర విద్యాశాఖ ప్రయోగాలకు సిద్ధమైంది. ఈ వింత నిర్ణయాలు క్షేత్ర స్థాయిలో సమస్యలు తెచ్చిపెట్టాయి. విద్యార్థులను, టీచర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పబ్లిక్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అనుభవం లేని జూనియర్ టీచర్లకు కీలక బాధ్యతలు అప్పగించారు. సీనియర్ టీచర్లను విస్మరించడం వల్ల మొదటి రోజు జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాల్లో గందరగోళ వాతావరణం నెలకొంది.
జూనియర్ల చేతుల్లో చీఫ్ బాధ్యతలు
పరీక్షల నిర్వహణలో అత్యంత కీలకమైన చీఫ్ సూపరింటెండెంట్ బాధ్యతలను ఈ సారి ఎటువంటి అనుభవం లేని వారికి కట్టబెట్టారు. గతంలో పదేళ్లుగా చీఫ్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన వారిని ప్రస్తుతం పక్కన పెట్టారు. గతంలో ఎన్నడూ చీఫ్ బాధ్యతలు నిర్వహించని, చీఫ్ విధులపై అవగాహన లేని జూనియర్ టీచర్‌లకు చీఫ్ బాధ్యతలను అప్పగించారు. విచిత్రమేమిటంటే, గతంలో చీఫ్ సూపరింటెండెంట్‌లుగా పనిచేసిన సీనియర్ టీచర్‌లను ప్రస్తుతం సాధారణ ఇన్విజిలేటర్‌లుగా నియమించారు. ఈ విధానం విద్యాశాఖలోని సమన్వయ లోపానికి అద్దం పడుతోంది.
బెదిరింపు ధోరణి
విద్యాశాఖ అధికారుల వింత ధోరణి పై ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్య కారణాలతో ఇన్విజిలేషన్ విధుల నుంచి మినహాయింపు కోరుతున్న వారిని అధికారులు బెదిరింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఒక వేళ విధులకు హాజరుకాకపోతే జూన్ వరకు సెలవు పెట్టాల్సి ఉంటుంది అంటూ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీచేస్తున్నారు. దీంతో టీచర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రశాంతంగా మొదటి రోజు పరీక్ష
జిల్లాలో మొదటి రోజు ల్యాంగ్వేజెస్–1 పరీక్ష ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని అబ్జర్వర్ మువ్వారామలింగం, డీఈవో రాజేంద్రప్రసాద్‌లు అన్నారు. జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ పరీక్ష కేంద్రాన్ని వారు తనిఖీ చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి సీసీ కెమెరాలు, సిట్టింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యలు ఏవైనా మా దృష్టికి వస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు.
జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ కేంరద్రాన్ని తనిఖీ చేసిన అబ్జర్వర్
విద్యార్థులను తనిఖీ చేసి లోనికి పంపుతున్న పోలీసులు, సిబ్బంది
పది పబ్లిక్‌లో ప్రయోగాలు!
మొదటి రోజు 252 మంది గైర్హాజరు
జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు 129 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ల్యాంగ్వేజ్ పేపర్–1 (తెలు గు, ఉర్దూ, తమిళం) పరీక్షకు 252 మంది గైర్హాజరయ్యారు. 21,062 మంది విద్యార్థులకు గాను 20,810 మంది హాజరయ్యారు. మొదటి రోజు పరీక్ష నిర్వహణలో జిల్లాకు విచ్చేసిన అబ్జర్వర్ మువ్వారామలింగం విస్తృతంగా పలు కేంద్రాల ను తనిఖీ చేశారు. డీఈవో రాజేంద్రప్రసాద్ 8 పరీక్ష కేంద్రాలను, ప్‌లైయింగ్ స్క్వాడ్ లు 14 మంది 63 కేంద్రాలను పరిశీలించారు. 96 కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్‌లు విధులు నిర్వహించారు. పలు పరీక్ష కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది ఐడీ కార్డులు ధరించకుండా కనిపించారు.
తొలి రోజే తడబాటు
కొత్త చీఫ్ సూపరింటెండెంట్‌లకు అవగాహన రాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. మొదటి రోజే తడబాటుకు లోనయ్యారు. గంగవరం, పలమనేరు ప్రాంతాల్లోని పలు కేంద్రాల్లో ప్రశ్నపత్రాల పంపిణీలో తారుమారు చోటుచేసుకుంది. కుప్పం, జీడీనెల్లూరు, నగరి ప్రాంతాల్లో సైతం ఇలాంటి సమస్యలే తలెత్తాయి. తారుమారైన పత్రాలను విద్యార్థులకు అందజేయడం, ఆ తర్వాత వాటిని సరిదిద్దడం, సమయపాలన పాటించకపోవడం వంటి ఫిర్యాదులు జిల్లా వ్యాప్తంగా వెలువెత్తాయి. దీంతో నిమిషాల సమయం వృథా కావడంతో విద్యార్థులు ఆందోళనకు లోనయ్యారు. అలాగే చాలా పాఠశాలల్లో ఫ్యాన్లు పనిచేయకపోవడంతో విద్యార్థులు ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్న కేంద్రాల్లో రెండు, మూడు బిందెలు నీటిని పెట్టి చేతులు దులుపుకున్నారు. పలు పరీక్ష కేంద్రాల్లో ఉదయం 8.45 అవుతున్నా విద్యార్థులను లోనికి అనుమతించకుండా బయటే నిరీక్షించేలా చేశారు.


