నేటి నుంచి పది పబ్లిక్ పరీక్షలు పరీక్షలకు 23,095 మంది విద్యార్థులు సందేహాలు, ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్ సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
జిల్లా సమాచారం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు అర గంట ముందే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచిస్తున్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్‌లను మూసివేయాలని ఇప్పటికే ఆదేశించారు. పరీక్షలు షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణపై కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు, వైద్య ఆరోగ్య సిబ్బంది విధుల్లో ఉంటారు. హాల్‌టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. పరీక్ష సమయాల్లో వివిధ రూట్లకు మరిన్ని బస్సులు తిప్పేలా ఆర్టీసీ అధికారులకు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అలాగే పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్ వెబెక్స్‌లో పరీక్షల నిర్వహణపై ఆదేశాలు జారీచేశారు.
సందేహాల నివృత్తి కోసం
జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ పై సందేహాలు, ఫిర్యాదులకు డీఈవో కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణపై విద్యార్థులు, తల్లిదండ్రులకు ఏవైనా సమస్యలు, సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకు డీఈవో కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం నంబర్ 9032185001ను ఏర్పాటు చేశారు.
పరీక్ష కేంద్రాలు 129
బాలురు (రెగ్యులర్) 10,737
బాలికలు (రెగ్యులర్) 10,264
బాలురు (ప్రైవేట్, వన్స్‌ఫెయిల్డ్) 1,318
బాలికలు (ప్రైవేట్, వన్స్‌ఫెయిల్డ్)726
మొత్తం విద్యార్థులు 23,095


