చిత్తూరు కలెక్టరేట్ : చెరుకు రైతులకు అందాల్సిన బకాయిల చెల్లింపునకు చర్యలు చేపడుతామని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ హామీ ఇచ్చారు. ఆదివారం కలెక్టరేట్‌లో నేతమ్స్ షుగర్స్ ఫ్యాక్టరీ నిర్వాహకులు, రైతులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నగరి నియోజకవర్గం నిండ్ర మండలంలోని నేతమ్స్ షుగర్స్ ఫ్యాక్టరీ నుంచి ఉద్యోగులు, రైతుల దీర్ఘకాలిక బకాయిల పరిష్కారానికి కసరత్తు చేపడుతామన్నారు. బకాయిల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఫ్యాక్టరీ నిర్వాహకులు రైతులకు రూ.35.92 కోట్లు, ఉద్యోగుల జీతాలు దాదాపు రూ.13 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. బకాయిల వసూలు ప్రక్రియలో జాప్యాన్ని నివారించేందుకు హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ద్వారా చట్టపరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బకాయిలు త్వరగా ఇచ్చేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. సమావేశంలో చక్కెర కర్మాగారం కమిషనర్ ముత్యాలు, రైతు సంఘం ప్రతినిధులు ఆదినారాయణరెడ్డి, శ్రీనివాసులు, ఉద్యోగ సంఘం నాయకులు భాస్కర్‌రెడ్డి, సంపత్ పాల్గొన్నారు.


