గంగవరం : విద్యుత్ స్తంభంపైన కరెంటు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్‌కు గురైన ఫీల్డ్ అసిస్టెంట్ ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.. కరెంటు తీగలపైనే వేలాడుతూ కొంతసేపు శరీరంలో చలనం లేకుండా అలాగే ఉండిపోయాడు.. చూసినవాళ్లందరూ అతడు మరణించాడనుకున్నారు.. కట్ చేస్తే.. ఒక్కసారిగా అతడు పైకి లేవడంతో హమ్మయ్య బతికిపోయాడులే అని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన మండలంలో శుక్రవారం జరిగింది. వివరాలకు మండలంలోని గుండుగల్లు సబ్ స్టేషన్‌లో ఫీల్డ్ అసిస్టెంట్ (ఎఫ్‌ఏ)గా మహేంద్ర(34) విధులు నిర్వహిస్తున్నాడు. కరెంటు మరమ్మతు కారణంగా నాలుగు రోడ్ల వద్ద విద్యుత్ స్తంభం పైకి ఎక్కి మరమ్మతు పనులు పనులు చేస్తున్నాడు. ఒక్కసారిగా తీగల్లో విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురయ్యాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతడు కొద్దిసేపు తీగలపైన వేలాడుతూ అలాగే ఉండిపోయాడు. గమనించిన స్థానికులకు షాక్ గురైన అతడు చనిపోయి ఉంటాడనుకున్నారు. విద్యుత్ సిబ్బంది అక్కడికి వెళ్లి వెంటనే కరెంట్ సరఫరా ఆపేసి అతడిని కిందికి దించే ప్రయత్నం చేశారు. అంతలో అతడు పైకి లేవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. స్థానికులు బాధితుడిని చికిత్స కోసం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతడికి చికిత్స చేసి సాయంత్రానికి ఇంటికి పంపించారు.


