చిత్తూరు అర్బన్: ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి వారి నుంచి 151 గ్రాము ల బంగారు నగలు, రెండున్నర కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్టు ఏఎస్పీ రాజశేఖర్ రాజు, డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. వారు గురువారం సీఐ లు నెట్టికంటయ్య, మహేశ్వరతో కలిసి చిత్తూరు నగరంలోని పోలీసు అతితి గృహంలో మీడియాతో మాట్లాడారు. దుండగులు గత నెల 5వ తేదీన చిత్తూరులో ని దుర్గానగర్ కాలనీకి చెందిన మాజీ సైనికుడు వరదరాజులు నాయుడు ఇంటి తలుపులు పగులగొట్టి, బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, పూజ గదిలో ఉన్న వెండి ఆభరణాలను దొంగలు చోరీ చేశారని తెలిపారు. దీనిపై చిత్తూరు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని పేర్కొన్నారు. చిత్తూరు–వేలూరు రోడ్డులో గురువారం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు యువకులు పారిపోవడానికి ప్రయత్నించారని తెలిపారు. వారిని పోలీసులు వెంబడించి పట్టుకుని విచారించగా చిత్తూరులో చోరీ చేసింది తామేనని అంగీకరించారని చెప్పారు. నిందితులు తమిళనాడులోని సేలంకు చెందిన లల్లూ ప్రసాద్ (34), జనార్దన్ (31)గా గుర్తించామన్నారు. వారి నుంచి 151 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.6 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. వాటి విలువ దాదాపు రూ.36 లక్షలు ఉంటుందని తెలిపారు. కా గా నిందుతుల్లో ఒకడైన లల్లూ ప్రసాద్‌పై తమిళనాడులోని ఈరోడ్, నామక్కల్ తదితర ప్రాంతాల్లో రెండు హత్య కేసులు, 11 దోపిడీ, 16 చోరీ కేసులు ఉన్నా యని తెలిపారు. జనార్దన్‌పై తమిళనాడులో ఏడు కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ కేసును ఛేదించడంతో ప్రతిభ చూపించిన ఎస్‌ఐ రమేష్, ఏఎస్‌ఐ దేవరాజులు, బాబు, శ్రీనివాసులు, తవరాజ్ తదితరులను ఏఎస్పీ అభినందించారు.
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 25 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 66,606 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,899 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.78 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.
తిరుమలలో ఆకస్మిక తనిఖీలు
భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమలలోని హోటళ్లలో రెవెన్యూ, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆహార భద్రతా సిబ్బంది సన్నిధానం ప్రాంతం నుంచి తనిఖీలను ప్రారంభించారు. ఐస్‌క్రీమ్‌లు, తాగునీరు, పాలు వంటి త్వరగా పాడయ్యే ఆహార పదార్థాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. తిరుమలలోని అన్ని హోటళ్లలోనూ నమూనాలను సేకరించినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి జగదీష్ తెలిపారు.


