ముద్దుకృష్ణమనాయుడి విగ్రహానికి ఉన్న అనుమతి వైఎస్సార్‌సీపీ పతాక దిమ్మెకు లేదా? టీడీపీ నేతలా వ్యవహరించే ప్రతి అధికారి పేరును డిజిటల్ బుక్‌లో ఎక్కిస్తాం వారు ఎక్కడున్నా చట్ట ప్రకారం శిక్షిస్తాం మాజీ మంత్రి ఆర్కేరోజా ఆగ్రహం
నగరి : పట్టణంలో గురువారం వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసుకున్న పార్టీ పతాక దిమ్మెను మున్సిపల్ కమిషనర్ కూల్చేయడం దుమారం లేపింది. గతంలో నిర్మించిన పతాక దిమ్మెకు రెండు వైపులా ఎన్టీఆర్, గాలి ముద్దుకృష్ణమనాయుడి విగ్రహాలు ఉన్నాయి. అంతేగాక దుకాణాలు ఏర్పాటుచేశారు. దీంతో వైఎస్సార్ సీపీ నేతలు గురువారం తెల్లవారుజామున మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ఆనుకుని నూతన పతాక దిమ్మెను చిన్నదిగా ఏర్పాటు చేసుకున్నారు. ఎవరూ లేని సమయంలో మున్సిపల్ కమిషనర్ బాలాజీనాయక్ దిమ్మెను కూల్చివేసి పతాక స్తంభాన్ని పక్కన పడేసి వెళ్లిపోయారు. వేడుకలు జరుపుకోవడానికి అక్కడికి వచ్చిన నేతలు పతాక దిమ్మెను తొలగించడాన్ని చూసి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. మాజీ మంత్రి ఆర్కేరోజా మున్సిపల్ కమిషనర్ తీరుపై మండిపడ్డారు. ఆమె మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నగరి మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన బాలాజీ యాదవ్ మున్సిపాలిటీని నాశనం చేసి సస్పెండ్ అయ్యాడన్నారు. ఇప్పుడు బాలాజీనాయక్ అహంకారంతో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడానికి ఏర్పాటుచేసిన దిమ్మెను కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న పాలనలో నగరిలో ఆస్పత్రి అభివృద్ధితోపాటు డయాలసిస్ సెంటర్, క్రిమియేషన్ సెంటర్, పార్కు, రోడ్లు, డ్రైనేజీలు ఇలా అనేక పనులు చేపట్టామన్నారు. 16 ఏళ్లుగా వైఎస్సార్ సీపీ ప్రజల పక్షాన నిలిచి పనిచేస్తోందని వివరించారు. గత ఐదేళ్లలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసినట్టు తెలిపారు. అలాంటి పార్టీ పతాక దిమ్మెను కూల్చేయడం శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్య అన్నారు.
ముద్దు కృష్ణమనాయుడి విగ్రహానికి అనుమతి ఎలా ఇచ్చారు
చిన్న దిమ్మె కట్టుకుంటే కూల్చేసిన అధికారులు ముద్దు కృష్ణమనాయుడు విగ్రహానికి ఎలా అనుమతిచ్చారో చెప్పాలని మాజీ మంత్రి ఆర్కేరోజా ప్రశ్నించారు. ఆయన నియోజవర్గానికి ఏమి చేశారని విగ్రహం పెట్టారని పేర్కొన్నారు. దాన్ని తీసేయాలని మున్సిపల్ కౌన్సిల్‌లో తీర్మానించినా తొలగించడానికి చొరవ చూపని అధికారులు దిమ్మెలను తొలగించడానికి అత్యుత్సాహం చూపుతున్నారని తెలిపారు. వారు అధికార పార్టీ తొత్తులుగా పనిచేస్తున్నారని అనడానికి ఈ సంఘటన అద్దం పడుతోందన్నారు. నడిచేది ప్రజాస్వామ్య ప్రభుత్వమా? నిరంకుశత్వమా అని ప్రశ్నించారు. ఇలా టీడీపీ నేతల్లా వ్యవహరించే అధికారుల పేర్లను డిజిటల్ బుక్‌లో నమోదు చేస్తున్నామని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడున్నా చట్ట ప్రకారం శిక్షిస్తామని హెచ్చరించారు.


