చిత్తూరు అర్బన్/చిత్తూరు కార్పొరేషన్ : ఇతరులు చేసిన అభివృద్ధి పనులను తమ ఖాతాలోకి వేసుకోవడంతో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ నాయుడు సీఎం చంద్రబాబు నాయుడిని మించిపోయారని వైఎస్సార్ సీపీ చిత్తూరు సమన్వయ కర్త ఎంసి.విజయానందరెడ్డి ధ్వజమెత్తారు. ఆయన గురువారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో చిత్తూరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను తానే చేయించినట్లు గురజాల డప్పు కొట్టుకోవడం హాస్యాస్పదమన్నారు. చిత్తూరులోని ఫారెస్టు–పీవీకేఎన్ రోడ్డు పనులకు 2023లో టెండర్లు పిలిచారని, జేఎంసీ కంపెనీ 2024లో పనులను దక్కించుకుందన్నారు. వాటిని తానే చేయించినట్లు చెప్పుకోవడం గురజాల జగన్‌కే చెల్లిందన్నారు. తన పార్టీ మహిళా కార్యకర్త రోడ్డుపై పడి మృతి చెందితే రూపాయి ఆర్థిక సాయం చేయని స్థానిక ఎమ్మెల్యే, ఒక పిల్లాడిని ట్రాక్టర్ ఢీకొట్టిన ప్రమాదంతో చలించిపోయి రోడ్డు వేయించానని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. చిత్తూరు నియోజకవర్గంలో తొమ్మిది ప్రాంతాల్లో తన సొంత నిధులతో ప్రజల కోసం మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశానని తెలిపారు. వాటిపై గురజాల జగన్‌మోహన్ బొమ్మలు అతికించి క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని దుయ్యబట్టారు. పలమనేరు రోడ్డులో తన సొంత ఆస్తులు, బినామీ ఆస్తులు ఉండడంతో అక్కడ విస్తరణ డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు. కట్టమంచి చెరువులో మట్టి తవ్వి రూ.కోట్లు కొల్లగొట్టారని తెలిపారు. కాజూరు చెరువు, కొట్రకోన, దొడ్డిపల్లె వద్ద అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్న టీడీపీ నేతలకు ఎమ్మెల్యే కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు. చిత్తూరు–తచ్చూరు, చైన్నె–బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవేరోడ్లు, చీలాపల్లెలోని సీఎంసీ ఆస్పత్రి అభివృద్ధి, చిత్తూరు–తిరుపతి డబుల్ రోడ్డు పనులన్నీ వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా జరిగినవేనని ప్రజలందరికీ తెలుసన్నారు. వీటిని గురజాల జగన్‌మోహన్ నాయుడు తన ఖాతాలోకి వేసుకోవడం సిగ్గు చేటన్నారు.


