చిత్తూరు అర్బన్: చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ (పాలకవర్గం) చివరి సమావేశం ముగిసింది. 2021లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో 50 డివిజన్లకుగాను 46 డివిజన్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని.. మేయర్ స్థానాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఆపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, కొందరు కార్పొరేటర్లు ఆ పార్టీలో చేరి, సస్పెన్షన్లకు గురవడమూ తెలిసిందే. కాగా ఈ నెల 17తో పాలకవర్గం గడువు ముగియనుండా.. మంగళవారం చివరి సమావేశాన్ని పూర్తిచేశారు. మేయర్ అముద అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌నాయుడు తదితరులు హాజరయ్యారు. ఇందులో పలు ప్రధాన సమస్యలు ప్రస్తావించారు.
ఇవీ సమస్యలు
మంగసముద్రం డంపింగ్ యార్డ్ సర్వే నం.135లో రెండు ఎకరాల స్థలం ఉంది. దాన్ని అభివృద్ధి చేయలే కానీ, ఎవరికీ ఇవ్వరాదని డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ సభలో వెల్లడించారు. 50 ఏళ్ల ముందు మిలిటరీ పట్టాగా ఆ స్థలం తనకు ఇచ్చారని ఓ బాధితురాలు తనవద్దకు వచ్చారన్నారు. ఆ స్థల విక్రయాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ స్థలం మున్సిపల్‌కు సంబంధించిందని.. దాని విక్రయించొద్దని సభలో ప్రసావించారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 9వ డివిజన్‌లో కాలువలు నిర్మించి, రోడ్డును విస్తరించాలన్నారు. అలాగే కొంగారెడ్డిపల్లెలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయ ప్రాంతంలో కాలువలు ఏర్పాటు చేయాలన్నారు. కట్టమంచి నుంచి సాంబయ్యకండ్రిగ రోడ్డు పనులు వేగం పెంచాలన్నారు. ఈ మార్గంలో ఉన్న అమ్మవారి ఆలయాన్ని తొలగించకుండా పనులు చేయాలని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ హరిణిరెడ్డి సభలో ప్రస్తావించారు.
కరోనా సమయంలోనూ జగనన్న పాలనలో సంక్షేమ పథకాలు అందించామని గుర్తుచేశారు. జగనన్న పాలనలో అభివృద్ధి జరగలేదని చెప్పడం సరికాదని వెఎస్సార్‌సీపీ కార్పొరేటర్ స్వరూపరాణి ఖండించారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ షర్మిల మాట్లాడుతూ కట్టమంచి చెరువు వద్ద బ్యూటిఫికేషన్ పనులు చేయాలన్నారు. స్థానిక గంగినేనిచెరువులో మౌలానా అబుల్ కలాం ఆజాద్, అబ్దుల్ కలాం విగ్రహలను ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ కో–ఆప్షన్ సభ్యుడు ఆను కోరారు. గతంలో స్థానిక ఫారెస్టు రోడ్డులో ప్రమాదంలో మరణించిన పాఠశాల విద్యార్థి జైనిరూప్ పేరును ఆ రోడ్డుకు పెట్టడానికి ఆమోదం తెలిపారు.
మాజీ సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు
గత పాలనలో మేయర్‌గా అవకాశం ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మేయర్ అముద కృతజ్ఞతలు తెలియజేశారు. పాలన కాలంలో సహకరించిన యంత్రాగానికి ధన్యావాదాలు తెలిపారు. కమిషనర్ నరసింహ ప్రసాద్ మాట్లాడుతూ నగరపాలక పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే, మేయరు, డిప్యూటీ మేయర్లు, సభ్యుల సహకారం మరువలేనిదన్నారు. ఈ సమావేశంలో చుడా చైర్ పర్సన్ కఠారిహేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్‌కుమార్‌రెడ్డి, సహాయ కమిషనర్ ఎ.ప్రసాద్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


