పొగపొయ్యే దిక్కా? | - | Sakshi
Sakshi News home page

పొగపొయ్యే దిక్కా?

Mar 11 2026 7:49 AM | Updated on Mar 11 2026 7:49 AM

● కమర్షియల్‌ సిలిండర్ల సరఫరాపై ప్రభావం ● హోటళ్లకు సిలిండర్లు నిలిపివేయాలని డీలర్లకు ఆదేశాలు? ● ఆస్పత్రులు, వసతిగృహాలకు మాత్రమే సరఫరా ● ఉమ్మడి చిత్తూరు జిల్లాలో హోటల్‌ యజమానులు, భక్తుల ఆందోళన

గ్యాస్‌ గుబులు

అమెరికా, ఇజ్రాయిల్‌, ఇరాన్‌ యుద్ధం ఉధృతం అవుతోంది. దీంతో నౌకాశ్రయాలు మూతపడ్డాయి. వెరసి క్రూడ్‌ ఆయిల్‌..గ్యాస్‌ దిగుమతి ఆగింది. ఫలితంగా దేశంలో ఆయిల్‌, గ్యాస్‌ నిల్వలు తరుగుతున్నాయి.. ఈ క్రమంలో ఇప్పటికే వ్యాపార సిలిండర్ల సరఫరా నిలిపివేతకు గ్యాస్‌ డీలర్లకు మౌఖిక ఆదేశాలు అందాయి. ఈ క్రమంలో హోటళ్లు మూత వేస్తారా? లేక కట్టెల పొయ్యిలపై ఆధారపడతారా? అన్న సంశయం నెలకొంది.

సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఇరాన్‌ యుద్ధ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గ్యాస్‌ కొరత ఏర్పడింది. ఆ ప్రభావం ఉమ్మడి చిత్తూరు జిల్లాపై పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్లపై ఆంక్షలు విధించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో హోటళ్లకు కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల సరఫరా ఆపివేయాలని మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తలెత్తే అవకాశం ఉండడంతో వినియోగ దారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్‌పీజీ సిలిండర్ల కొరత నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశ ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక నగరాల్లో మంగళవారం ఉదయం నుంచే కమర్షియల్‌ సిలిండర్ల బుకింగ్‌ నిలిపివేసినట్లు సమాచారం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ కమర్షియల్‌ సిలిండర్లు సరఫరా నిలిపివేయాలని డీలర్లకు మౌఖికంగా ఆదేశాలు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే జరిగితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే ప్రమాదం ఉంది. అయితే అస్పత్రులు, వసతి గృహాలకు మాత్రం కమర్షియల్‌ సిలిండర్లు సరఫరా కొనసాగేలా కేంద్రం చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.

గ్యాస్‌ సంక్షోభం తప్పదా?

యుద్ధం ప్రభావంతో గ్యాస్‌ సంక్షోభం ఏర్పడే ప్రమా దం ఉందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన నగరాలైన ముంబై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో హోటళ్లు మూసివేసినట్లు సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు, పర్యాటకులు తిరుపతికి వచ్చి వెళుతుంటారు. భక్తులు, పర్యాటకులను దృష్టిలో ఉంచుకుని తిరుపతి పరిసర ప్రాంతాల్లో భారీగా హోటళ్లు, రెస్టారెంట్లు, చిరుతిళ్లు దుకాణాలు వెలిశాయి. తిరుపతి జిల్లాలో 25,800 కమర్షియల్‌ సిలిండర్లు ఉన్నాయి. ఇందులో ఒక్క తిరుపతిలోనే 50 శాతానికిపైగా కమర్షియల్‌ సిలిండర్లు వినియోగంలో ఉన్నాయి. ప్రతి నెలా లక్షకుపైగా సిలిండర్ల అవసరం ఉందని అంచనా. ప్రచారంలో ఉన్నట్టు కమర్షియల్‌ సిలిండర్ల సరఫరా ఆపేస్తే.. తిరుపతి జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే అవకాశం ఉంది. అదే జరిగితే.. భక్తులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. చిత్తూరు జిల్లాలో సుమారు 12 వేల సిలిండర్లకుపైగా ఉన్నాయి. కమర్షియల్‌ సిలిండర్ల సరఫరా నిలిపివేస్తే కాణిపాక వరసిద్ధివినాయకు స్వామి దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంట గ్యాస్‌ సిలిండర్ల వరకై తే ఇప్పటి వరకు ఎటువంటి కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు. కమర్షియల్‌ సిలిండర్ల సరఫరాపైనా ఇంకా స్పష్టత రాలేదని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement