మజ్జిగ కోసం వచ్చి.. | - | Sakshi
Sakshi News home page

మజ్జిగ కోసం వచ్చి..

Mar 11 2026 7:49 AM | Updated on Mar 11 2026 7:49 AM

– మహిళ మెడలో చైన్‌ స్నాచింగ్‌

వెదురుకుప్పం: మజ్జిగ కోసం దుకాణానికి వచ్చి మహిళ మెడలో గుర్తుతెలియని వ్యక్తులు బంగారు చైన్‌ లాక్కెళ్లిన ఘటన మంగళవారం మండలంలోని నల్లవెంగనపల్లెలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నవీన్‌బాబు కథనం.. నల్లవెంగనపల్లె గ్రామ సచివాలయం పక్కన బాలాజీనాయుడు భార్య అమృత చిన్న దుకాణం నడుపుతోంది. మంగళవారం మధ్యాహ్నం గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు దుకాణం వద్దకు వచ్చి మజ్జిగ ప్యాకెట్లు కావాలని అడిగారు. మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చే క్రమంలో అమృత మెడలో ఉన్న బంగారు చైన్‌ను లాక్కొని పరారయ్యారు. బాధితురాలు కేకలు పెట్టింది. అప్పటికే దొంగలు పరారుకావడంతో జరిగిన ఘటనను భర్త బాలాజీనాయుడుకి చెప్పింది. చోరీకి గురైన చైన్‌ 20 గ్రాముల బరువు, రూ.3 లక్షల మేర ఉంటుందని బాధితురాలి తెలిపింది. అమృత ఫిర్యాదు మేరకు వెదురుకుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

వి.కోట : ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన మండలంలోని బీసీ పల్లెలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. మండలంలోని బీసీపల్లె గ్రామానికి చెందిన సోమశేఖర్‌ కుమార్తె వైష్ణవి(20) చింతలగుంట గ్రామానికి చెందిన శివతో మూడెళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం బీసీ పల్లిలో ఉంటున్న వైష్ణవికి గత రెండు రోజులుగా వాంతులు, విరేచనాలతో బాధపడుతూ పూర్తిగా నీరసించింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు సోమవారం అర్ధరాత్రి దాటాక ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వైష్ణవి మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆమె మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు సమాచారం. మృతురాలికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు.

శక్తివంతమైన ఆయుధం విద్య

పూతలపట్టు(యాదమరి): నేటి ఆధునిక యుగంలో అతివలు రాణించాలంటే విద్య అనే అత్యంత శక్తివంతమైన ఆయుధం వల్లే సాధ్యమవుతుందని ఎస్వీఎంవీవీ రిజిస్ట్రార్‌ ఉష తెలిపారు. మంగళవారం ఆమె మండల పరిధి పి.కొత్తకోట వేము ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. జీవితంలో లక్ష్యాలను సాధించాలంటే అభిలాష మాత్రమే ఉంటే సరిపోదని, అందుకు సరిపడా ఆసక్తి, పట్టుదల, క్రమశిక్షణ ముఖ్యమన్నారు. ప్రస్తుత సమాజంలోని కొందరు మహిళలపై చిన్నచూపు చూస్తున్నారని, అటువంటి ప్రతికూల ఆలోచనలు పట్టించుకోకుండా ముందుకు సాగాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ నవీన్‌ మాట్లాడుతూ తమ విద్యాసంస్థలో చదువుతున్న వారిలో సుమారు 52 శాతానికి పైగా అమ్మాయిలు ఉండడం సంతోషదాయకమన్నారు. కళాశాల పూర్తిగా ర్యాగింగ్‌ రహిత క్యాంపస్‌గా ఉందన్నారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ సాయిశిరీషా, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement