ఐరాల: మండలంలోని కస్తూరినాయనపల్లె సమీపంలోని మామిడి తోటలో 15 మామిడి చెట్లు నరికివేయడంపై సోమవారం ఫిర్యాదు అందినట్లు ఏఎస్‌ఐ వేణుగోపాల్‌నాయుడు తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని కస్తూరినాయనపల్లెకు చెందిన ఇంద్రావతి, వైఎస్.గేటుకు చెందిన వరప్రసాద్, నీరజాక్షలు నాయుడుకు ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీ సదరు భూమిలో సర్వే చేయడానికి రెవెన్యూ సిబ్బంది వెళ్లగా ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. ఇందులో ఇంద్రావతి, యామినికి స్వల్పగాయాలయ్యాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 15 మామిడి చెట్లను నరికివేసినట్టు ఆయన పేర్కొన్నారు. దీనిపై వరప్రసాద్, నీరజాక్షులనాయుడు సోమవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి నరికివేసిన మామిడి చెట్లను పరిశీలించారు. దీనిపై ఏఎస్‌ఐ తహసీల్దార్ లోకేశ్వరికి సమాచారం ఇచ్చారు. సర్వే చేసిన అనంతరం ఎవరి భూమిలో మామిడి చెట్లను నరికివేశారో నిర్థారిస్తామని తహసీల్దార్ తెలిపినట్లు ఏఎస్‌ఐ చెప్పారు.
ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
గుడుపల్లె: ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని సాలచింతనపల్లె గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ కథనం.. మండలంలోని కోడిగానిపల్లెకి చెందిన రాధాకృష్ణ తన సొంత పనులు చూసుకుని ద్విచక్ర వాహనంలో స్వగ్రామానికి బయల్దేరాడు. మార్గమధ్యంలో సాలచింతనపల్లె సమీపంలోని రోడ్డుపై ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాధాకృష్ణ అక్కడికక్కడే మృతిచెందాడు.


