చిత్తూరు అర్బన్: జిల్లాలో చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు పలమనేరు, నగరి, కుప్పం మున్సిపాల్టీలు ఉన్నాయి. కుప్పం మినహా మిగిలిన వాటి పాలకవర్గాలకు ఈనెల 17వ తేదీతో గడువు ముగుస్తుంది. కుప్పం పురపాలక సంఘానికి సైతం సెప్టెంబర్‌కు గడువు పూర్తవుతుంది. వాస్తవానికి గత ఏడాది నవంబర్‌లో ఓటర్ల జాబితా, మార్పులు–చేర్పులు పూర్తి చేసి, ఈ ఏడాది జనవరిలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాల్సింది. కానీ, ఎన్నికలకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. ప్రత్యేక అధికారులను నియమించి మరో 6 నెలల వరకు వేచి చూద్దా మని భావిస్తున్నట్లు తెలిసింది. ఈనెల 9వ తేదీన వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురించినా, అది ఎన్నికల వరకు వెళ్లకపోవచ్చని నిపుణులు అభి ప్రాయపడుతున్నారు.
సర్పంచ్‌లకు ‘పంచ్’
చిత్తూరు పూర్వపు జిల్లా ప్రకారం 600 గ్రామ పంచాయతీలకు ఎంపికై న సర్పంచ్ పదవీకాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. ఇప్పటికే పలు గ్రామా ల్లో చేసిన అభివృద్ధి పనులకు చంద్రబాబు ప్రభు త్వం బిల్లులు మంజూరు చేయలేదు. పదవిలో ఉన్నప్పుడు పట్టించుకోని ప్రభుత్వం.. మాజీలయ్యాక పంచ్ ఇవ్వడం ఖాయమని సర్పంచ్‌లు ఓ నిర్ణయానికి వచ్చేశారు.
సర్వేల్లో వ్యతిరేకతే కారణమా?
రోజుకు మూడు నుంచి నాలుగు పర్యాయాలు ఫోన్ల ద్వారా ప్రభుత్వం వివిధ సర్వేలు చేయిస్తోంది. ప్రజల నుంచి వస్తున్న ఫ్యీడ్‌బ్యాక్‌ను గమనిస్తోంది. విద్యుత్ సరఫరా, సంక్షేమ పథకాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ తదితర పథకాలు ఆగిపోవడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నట్లు గుర్తించింది. ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికలకు వెన్ను చూపిస్తున్నట్లు తెలిసింది.
స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. పాలనపై ప్రజలు ఇచ్చే తీర్పు ఇబ్బందికరంగా ఉంటుందని భావిస్తోంది. నిర్ణీత షెడ్యుల్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే అనుకూల ఫలితం రాకపోవచ్చని అంచనా వేస్తోంది. త్వరలోనే పురపాలకులు.. సర్పంచ్‌ల పదవీకాలం ముగియనుండడంతో ప్రత్యేక అధికారుల నియామకానికి మొగ్గుచూపుతోంది.
‘పరిషత్’పై పరేషాన్
జిల్లా పరిషత్‌లోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీల పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఉంది. అయితే తాజాగా అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన ప్రకటన పరిషత్ ఎన్నికల ఆశలపై నీళ్లు చల్లింది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో జిల్లా పరిషత్‌ల పునర్విభజన చేసిన తర్వాతే జెడ్పీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. దీనికితోడు మరో రెండు నెలల్లో కులగణన ప్రారంభిస్తామని సర్కారు చెప్పడంతో జెడ్పీ ఎన్నికలను సైతం వాయిదా వేస్తున్నారని అర్థమవుతోంది. పేరుకు పునర్విభజన, కులగణన వంటి సాకులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత లేదనే ఎన్నికల వైపు మొగ్గడం లేదని తెలుస్తోంది.


