పుత్తూరు: మహిళలు చదువుకోవడం ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమని పుత్తూరు సబ్ కోర్టు అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి కె.రమ్యసాయి తెలిపారు. శనివారం స్థానిక ఎస్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. న్యాయమూర్తి రమ్యసాయి మాట్లాడుతూ విద్యార్థులు నిరంతర కృషితో లక్ష్యాలను సాధించవచ్చని సూచించారు. నేటి తరం మహిళల ఆలోచనా ధృక్పథంలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. ప్రతి ఆడబిడ్డను విద్యావంతురాలిగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు తమవంతు పాత్ర పోషించాలని కోరారు. అనంతరం న్యాయమూర్తి రమ్యసాయిని అధ్యాపకులు ఘనంగా సత్కరించారు. ఈ క్రమంలోనే ఉత్తమ విద్యార్థుల మాతృమూర్తులను సన్మానించారు. మహిళా అధ్యాపకులకు మెమోంటోలను అందించారు. ప్రిన్సిపల్ డాక్టర్ బి.చంద్రమౌళి, ఉమెన్ ఎంపవర్‌మెంట్ సెల్ కన్వీనర్ డాక్టర్ కె.శ్రీదేవి, వైస్ ప్రిన్సిపల్ మన్యం నరసింహులు, అధ్యాపకులు సుజన, దేవకి, వాణిశ్రీ, గాయత్రి పాల్గొన్నారు.


