పూతలపట్టు(యాదమరి): జిల్లాలో ప్రముఖ విద్యాసంస్థ వేము ఇంజినీరింగ్ కళాశాల 18వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా ముగిశాయి. ఈ వేడుకలకు చిత్తూరు పార్లమెంటు సభ్యుడు దగ్గుమళ్ల ప్రసాదరావు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవినాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంపీ మాత్లాడుతూ.. దేశాభివృద్ధికి విద్యార్థులే పునాది అని, విద్యార్థులు తమ లక్ష్యాలు సాధించడానికి ఏకాగ్రతతోపాటు క్రమశిక్షణ చాలా ముఖ్యమని అన్నారు. అనంతరం కళాశాల చైర్మన్ మాట్లాడుతూ యువత తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. కష్టపడి పనిచేస్తే అపార అవకాశాలు ఉన్నాయని కళాశాల ప్రిన్సిపల్ నవీన్ కిలారి పిలుపునిచ్చారు. అనంతరం సినీ నటీ అర్చన అయ్యర్ విద్యార్థులతో ముచ్చటించి వేడుకలను మరింత ఉత్సాహంగా తీసుకెళ్లారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
మాట్లాడుతున్న ఎంపీ ప్రసాదరావు
విద్యార్థులతో కలసి సినీనటి అర్చన అయ్యర్ నృత్యం


