చిత్తూరు కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాల విద్యార్థిని తేజశ్రీ ఎన్‌సీసీలో రాణిస్తోంది. సి–సర్టిఫికెట్ క్యాడెట్‌గా ప్రతిభ చాటి న ఆ విద్యార్థిని జిల్లాకు, కళాశాలకు గర్వకారణంగా నిలుస్తోంది. ఎన్‌సీసీలో పలు జాతీయ స్థాయి విజయాలను సొంతం చేసుకున్నారు. తేజశ్రీ ఆర్మీ అటాచ్‌మెంట్ క్యాంపులో పాల్గొని భారత సైనిక దళాల జీవనశైలిని, వారి కఠిన శిక్షణ పద్ధతులను దేశ రక్షణలో సైనికుల బాధ్యతలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ అనుభవం ఆమెలో దేశ సేవ చేయాలనే దృఢ సంకల్పాన్ని మరింత పెంచింది.
సాహస కృత్యాల్లోనూ మేటి
కేవలం సైనిక శిక్షణే కాకుండా, మౌంటెనింగ్ శిబిరాల్లోనూ తేజశ్రీ తన సత్తా చాటారు. ట్రెక్కింగ్, రాక్ క్‌లైంబింగ్ తదితర సాహస కృత్యాలలో పాల్గొంది. కష్టతరమైన పరిస్థితుల్లో మనుగడ సాగించే నైపుణ్యాలను, శారీరక దృఢత్వాన్ని ఆమె పెంపొందించుకున్నారు. విద్యార్థిని ప్రతిభను గుర్తించిన అధికారులు, జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఈ ఏడాది మే నెలలో జరగనున్న ప్రతిష్టాత్మక ఎన్‌సీసీ శిబిరానికి ఎంపిక చేశారు. శనివారం పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అభినందన సభను నిర్వహించి విద్యార్థినిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జీవనజ్యోతి, అధ్యాపకులు పాల్గొన్నారు.


