చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల మొదటి సెట్ ప్రశ్నపత్రాలు శనివారం చిత్తూరుకు చేరుకున్నాయి. డీఆర్‌ఓ మోహన్ కుమార్, డీఈఓ రాజేంద్రప్రసాద్ పర్యవేక్షణలో స్ట్రాంగ్‌లో రూమ్‌కు తరలించారు. సాయుధ పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బయటి వ్యక్తులు ఎవరూ లోపలికి ప్రవేశించకుండా సీసీ కెమెరాలతో పెట్టినట్లు అధికారులు తెలిపారు.
పోలీస్ స్టేషన్లకు తరలింపు
డీఆర్‌ఓ, డీఈఓ పర్యవేక్షణలో పకడ్బందీ భద్రత నడుమ ప్రశ్నపత్రాల బాక్సులను సంబంధిత పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. పరీక్షలు ముగిసే వరకు ఈ ప్రశ్నపత్రాలు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీసుల ఆధీనంలోనే ఉంటాయని,షెడ్యూల్ మేరకు నిర్ణీత సమయానికి ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాలకు చేరవేస్తామని అధికారులు వివరించారు.
144 సెక్షన్
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ కట్టుదిట్టంగా అమలు చేయాలని డీఆర్‌ఓ మోహన్ కుమార్ ఆదేశించారు. ఎవరైనా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినా, పేపర్ లీకేజీ వదంతులు సృష్టించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ జయప్రకాష్‌నాయుడు, ఎంఈఓలు అరుణాచలరెడ్డి, హసన్‌బాషా పాల్గొన్నారు.


