పుత్తూరు: అసలే రాత్రి వేళ.. అందులోనూ నేషనల్ హైవే రోడ్డుపై మలుపు వద్ద ఓ మోటర్ సైకిల్ నిర్లక్ష్యంగా రోడ్డు దాటుతుండగా, అతి వేగంతో మరో మోటర్ సైక్లిస్టు ఢీ కొట్టాడు. ఫలితం ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కార్వేటినగరం అప్పాచారి వీధికి చెందిన ఎం.రవి(45) తమ సమీప బంధువు పెళ్లికి మోటర్ సైకిల్‌పై బయల్దేరాడు. గొల్లపల్లి హైవే పక్కన ఉన్న కళ్యాణమండపానికి వెళ్లడానికి గొల్లపల్లి క్రాస్ వద్ద రోడ్డు దాటుతుండగా, పుత్తూరు మండలం ఎగవ గూళూరు గ్రామానికి చెందిన హరి(27) పుత్తూరు నుంచి గ్రామానికి మోటార్ సైకిల్‌పై వెళ్తూ వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. అదే సమయంలో పుత్తూరు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న 108 సిబ్బంది వెంటనే ప్రథమ చికిత్సకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో కళ్యాణమండపంలో విషాదఛాయలు అలముకొన్నాయి.
నాటు తుపాకులపై దర్యాప్తు
చిత్తూరు రూరల్(కాణిపాకం): నాటు తుపాకులపై తాలూకా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు మండలం తుమ్మింద గ్రామంలో ఓ యువకుడు.. మరో యువకుడిని నాటు తుపాకీతో కాల్చి చంపేసిన విషయం విదితమే. దీనిపై ఎస్పీ తుషార్ డూడీ స్పందించారు. ఎస్‌ఐ అశోక్‌కుమార్ తన బృందంతో కలిసి నాటు తుపాకుల పూర్వాపరాలపై దర్యాప్తు చేపట్టారు.
మృతులు రవి
హరి


