మోసాల బాబు.. మీ వేషాలు చాలు!
50 ఏళ్లకు పింఛన్ ఎక్కడ? నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధికి నిధులేవీ? హామీల అమలుపై భగ్గుమంటున్న జిల్లా ప్రజలు
ఎన్నికలకు ముందు కూటమి నేతలు సవాలక్ష హామీలు గుప్పించారు. సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్, ఆడ బిడ్డ నిధికింద 18 ఏళ్లు నిండి ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామని ప్రగల్భాలు పలికారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేవరకు నెలకు రూ.3 అంటూ జబ్బలు చరిచారు. డ్వాక్రా మహిళలకు సున్నావడ్డీ ఇప్పిస్తామని నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా ఇంతవరకు వాటి జోలికెళ్లలేదు కదా.. కనీసం బడ్జెట్‌లోనూ నిధులు కేటాయించలేదు. దీనిపై జిల్లా ప్రజలు భగ్గుమంటున్నారు. ‘మోసాల బాబూ.. నీ వేషాలు ఆపు’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. – చిత్తూరు కార్పొరేషన్, చిత్తూరు కలెక్టరేట్, గుడిపాల
వెనుకబడిన ప్రాంతాలపై నిర్లక్ష్యం
రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అభివృద్ధిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. బడ్జెట్‌లో వెనుకబడిన ప్రాంతాల సాగునీటి ప్రాజెక్టులకు తక్కువ మొత్తం ఇచ్చారు. ప్రాజెక్టులు పూర్తి కావడానికి మరో 50 ఏళ్లు పట్టినా ఆశ్చర్యం లేదు. ప్రభుత్వం ప్రకటించిన రూ.18,019 కోట్లలో ఇప్పటికే రూ.14,751 కోట్లు ఖర్చయ్యాయని, రాబోయే ఏడాదికి కేవలం రూ.3,269 కోట్లు మాత్రమే కేటాయించడం హాస్యాస్పదం. ఈ అరకొర నిధులతో రాయలసీమ సహా వెనుకబడిన ప్రాంతాల ప్రాజెక్టులు కనుచూపు మేరలో పూర్తికావు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను ప్రపంచంలోనే అగ్రగామి హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ప్రకటన పచ్చి అబద్ధం. కడప స్టీల్ ప్లాంట్, బెంగళూరు – కడప – అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి, వ్యవసాయం, పారిశ్రామిక రంగానికి నిధులు కేటాయించకుండా అభివృద్ద్ధి ఎలా సాధ్యం. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, ఐఆర్ వంటి అంశాలకు బడ్జెట్‌లో స్థానం లేదు. ప్రభుత్వ అనుచిత వైఖరిని వెనుకబడిన ప్రాంతాల ప్రజలు ఖండించాలి. – యండపల్లి శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ


