హామీలిచ్చాడంటే అమలు చేయడు అంతే.. ఇదీ బాబు నైజం
నగరి: చేనేత కార్మికులను సీఎం చంద్రబాబు నాయుడు నిలువునా ముంచేశారు. ఎన్నికలకు ముందు ఉచిత విద్యుత్ ఇస్తామంటూ హామీలు గుప్పించారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం మరమగ్గ కార్మికులకు 500 యూనిట్లు, చేనేత కార్మికులకు 200 యూనిట్లు ఉచితంగా అందిస్తామని జబ్బలు చరిచారు. అధికారంలోకి వచ్చాక జీఓ మాత్రమే ఇచ్చి చేతులు పైకెత్తేశారు. ఇది కాగితాలకే పరిమితం కావడంతో నేతన్నలు నిట్టూర్పుల్లో కూరుకుపోయారు. జీవో విడుదలై ఏడాది కావస్తున్నా బడ్జెట్ విడుదల కాకపోవడంతో విమర్శలు ఎక్కుపెడుతున్నారు. 50 ఏళ్లకే నేతన్నలకు పెన్షన్ అన్నారు.. నగరిలో టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటుచేస్తామన్నారు.. ఇచ్చిన హామీ ఏదీ నెరవేరలేదంటూ ఆవేదన చెందుతున్నారు.
అటకెక్కిన విలీనం హామీ
తమ్ముళ్లూ మీకు అన్యాయం చేశారు. నియోజకవర్గాన్ని అడ్డంగా విడదీశారు. మా ప్రభుత్వం రాగానే మొదట మూడు మండలాలను తిరుపతి జిల్లాలో కలిపి న్యాయం చేస్తా.. ఇది చంద్రబాబు పర్యటనలో నగరిలో ఇచ్చిన తొలి హామీ. ఇది సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో కార్వేటినగరం బహిరంగ సభలో ప్రకటించారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఎన్నికల్లో తొలి హామీ ఇదే అంటూ ప్రకటించారు. అధికారం రానే వచ్చింది. నగరి, నిండ్ర, విజయపురం మండలాలను తిరుపతి జిల్లాలో కలిపేస్తాం అంటూ నేతలు ఊదరగొట్టారు. సీఎం సమ్మతించారంటూ తమ్ముళ్లు ప్రగల్భాలు పలికారు. సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆపై ప్రజాప్రతినిధులందరూ సమ్మతి తెలిపి లేఖలు పంపాలని సచివాలయాలకు, మున్సిపాలిటీలకు అధికారుల నుంచి సందేశాలు అందాయి. అందరూ సమ్మతి పంపితే రెండు నెలల్లో మూడు మండలాలు తిరుపతిలో కలిసిపోతాయని నియోజకవర్గం మొత్తం ఒకే జిల్లాలో ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి కొలువుదీరిన జిల్లాలో ఉండడం ఎవరికి ఇష్టం ఉండదంటూ మూడు మండలాలకు చెందిన ప్రజా ప్రతినిధులందరూ సమ్మతి పత్రాలు కూడా అందించారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులపై చర్చించి ముఖ్యమంత్రి వేసిన ఆమోదముద్ర నగరి, నిండ్ర, విజయపురం మండల ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. ఎన్నికల హామీ అటకెక్కేసింది.
‘ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా.. చేనేత కార్మికులకు 500 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తా... మాట నిలబెట్టుకొంటా.. ఎప్పుడూ బాబు మాటంటే మాటే.. మాట మీదుంటా... చేనేత కార్మికులను ఆదుకుంటానని మీకు తెలియజేసుకొంటున్నా’ పుత్తూరు బహిరంగ సభలో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ ఇదీ..!
హామీలిచ్చాడంటే అమలు చేయడు అంతే.. ఇదీ బాబు నైజం
హామీలిచ్చాడంటే అమలు చేయడు అంతే.. ఇదీ బాబు నైజం
హామీలిచ్చాడంటే అమలు చేయడు అంతే.. ఇదీ బాబు నైజం


